పట్టణ జీవితం ఏకశిలా సదృశం. గ్రామీణ జీవితం బహుసమాజాల చిన్న ప్రపంచం. అందుకే పల్లెలో పుట్టి పెరిగిన రాసాని పల్లెకు మాత్రమే పరిమితం కాలేదు. పల్లె బయట అడవుల్లోని సంచార జాతుల కథలకు విస్తరించినాడు. గొర్రెలు కాసే వృత్తిలో పుట్టిన రాసాని తన కులవృత్తి వరకే ఆగిపోలేదు. చాకలి, కురువ, దాసప్ప వంటి కులవృత్తుల వరకూ విస్తరించినాడు. బహుజనుడిగా పుట్టిన రాసాని బహుజనుడిగానే మిగిలిపోలేదు. దళిత కులాల కథల వరకూ విస్తరించినాడు. అతని రచనల్లోని వస్తు బాహుళ్యానికి అతని గ్రామీణ సమాజమే కారణం.

వడ్డెర చండీదాస్‌ 'అనుక్షణం' నవల వరకూ తెలుగు సాహిత్యం బ్రాహ్మణేతర కులాల ప్రసక్తిని దూరంగా ఉంచింది. అట్టడుగు ఆర్థిక వర్గాన్ని తాత్త్విక కేంద్రంగా స్వీకరించిన అభ్యుదయ విప్లవ సాహిత్యాలు కూడా కులాల ప్రసక్తిని దూరంగా ఉంచినాయి. ఒక భూదుర్మార్గుడైన భూస్వామికి రెడ్డి పేరు పెట్టి కథ రాయడం కూడా శ్రీశ్రీ తిరస్కారానికి లోనైంది.

గ్రామాలలో చచ్చిపోయిన గర్భిణీ కడుపుకోసి మృత శిశువును బైటకు తీసే మొండోళ్ళ కులవృత్తిని చిత్రించి గగుర్పాటుకు గురిచేస్తాడు. యానాదులూ, ఇర్లోళ్ళూ, నక్కలోళ్ళూ, పిచ్చగుంట్లోళ్ళు, ఎరుకలూ, ఎలుగొడ్డోళ్ళూ, గొరవయ్యలూ, ముడ్డిగంటోడూ వంటి రకరకాల గిరిజన, సంచార, యాచక కులాల వృత్తుల్లోకి పాఠకుల్ని చేయిపట్టి నడిపించుకుపోతాడు. - బండి నారాయణస్వామి

పేజీలు : 158

Write a review

Note: HTML is not translated!
Bad           Good