ప్రసిద్ధ బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ (1884-1950) రాసిన పథేర్ పాంచాలిని సత్యజిత్ రాయ్ సినిమాగా మలిచి ప్రపంచ ప్రసిద్ధం చేశాడు.

ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందనప్పటికీ, బిభూతి భూషణ్ రాసిన మరో నవల ''అరణ్యక'' (1938) కూడా ఎంతో విశిష్టమైన రచన.

దాన్ని సాహిత్య అకాడెమీ కోసం సూరంపూడి సీతారాం ''వనవాసి'' (1961) పేరిట తెలుగు చేశారు. ఎంతో కాలంగా ఆ పుస్తకం ప్రతులు ఎక్కడా దొరకడం లేదు.
వనవాసి కథాంశం చాలా సరళం.
కలకత్తాలో నిరుద్యోగిగా వున్న సత్యచరణ్ అనే యువకుడు అవినాశ్ అనే మిత్రుడి కోరిక మీద బీహార్లోని పూర్ణియా జిల్లాలో వున్న దాదాపు పదివేల ఎకరాల ఎస్టేట్ వ్యవహారాలు చూసే పనికి ఒప్పుకుంటాడు.
నగరాన్ని వదిలిపెట్టి, ఆ అడవిలో దాదాపు ఆరేళ్లపాటు వుండిపోతాడు. అక్కడ అడవి నరికించి, భూమిని సాగులోకి తెచ్చి ఎస్టేటు ఆదాయం పెంచలవలసిన పని ఒకవైపూ, నెమ్మదిగా తనను లోబరుచుకున్న అడవి సౌందర్యం ముందు వివశుడైపోవడం మరొకవైపూ అతణ్ణి లాగుతుంటాయి. ఆ క్రమంలో దీన దరిద్ర భారతదేశ ముఖచిత్రమొకవైపూ, ప్రాచీన అరణ్య సీమల మహా సౌందర్యం మరొకవైపూ అతడికి సాక్షాత్కరిస్తాయి.

ఈ అనుభవాలన్నిటినీ ఎన్నాళ్ల తరువాతనో ''కలకత్తా నగరంలో క్షుద్రమైన ఒక గొందిలో, అద్దె కొంపలో మధ్యాహ్నవేళ కూర్చుని భార్య కుట్టుపని సూది చేసే సవ్వడి వింటూ వున్న సమయంలో తలచుకుంటూ మనకి చెప్తాడు. 'ఆ నిగూఢారణ్య సౌందర్యం, తెల్లవారు ఝామున చంద్రాస్తమయ దృశ్యం, కొండల పైన ఆకులు లేని గోల్గోలీ చెట్లపై కొమ్మకొమ్మకూ పూసిన పచ్చని పూలరాశి, శుష్కకాశవనం వ్యాపింపచేసిన కసరువాసనలు 'గుర్తొస్తూంటే' మళ్ళీ ఎన్ని పర్యాయాలు ఊహాకల్పనలోనే గుర్రమెక్కి, వెన్నెల రాత్రిలో పూర్ణియా ప్రయాణం చేశానో గుర్తులేదు' (పే.106) అంటాడు.

కథకుడు పూర్ణియా అడవులకు వెళ్లిన మొదటి రోజుల్లో అతడి కచేరీ ఉద్యోగి ఒకడు 'అడవి మిమ్మల్ని ఆవహిస్తుంది, అప్పుడింక ఎలాటి కోలాహలమూ జనసమ్మర్థమూ రుచించవు' అంటాడు.
అడవి ఆవహించిన అనుభవం ఎలా వుంటుందో కథకుడు నెమ్మదిగా మనకు వర్ణించడం మొదలుపెట్టడంతో మనని కూడా అటవీ సౌందర్యం ఆవహించడం మొదలుపెడుతుంది. అందుకు బిభూతి భూషణ్ వాడిన భాష, చిత్రించిన సన్నివేశాలూ, వాటికి సూరంపూడి సీతారాం వాడిన తెలుగూ మనల్ని గాఢంగా సమ్మోహపరుస్తాయి. అది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చేదిగా వుంటుంది. ఒక మహారణ్య సమక్షంలో కథకుడు తనలోని మహామానవుణ్ణి సాక్షాత్కరించుకున్నాడనీ, గొప్ప సౌందర్యం మనలోని మనిషిని మేల్కొల్పుతుందనీ, అదే సౌందర్య ప్రయోజనమనీ, సాహిత్య ప్రయోజనమనీ చెప్పకుండానే చెప్తుందీ రచన. --------- చినవీరభద్రుడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good