మధ్యతరగతి మందహాసాలూ, కింది తరగతి చిందులాస్యాలూ, ఉన్నత వర్గాల ఉన్నత్త విలాసాలూ వెరసి సమాజంలో కొడిగట్టిపోతున్న మానవత్వం దీపం చుట్టూ మోగుతున్న ఆశా, పేరాశా, దురాశా, స్వార్ధం, మోసం, క్రౌర్యాల మరణమృదంగ ధ్వానాలను తన కథల ద్వారా వినిపించిన విశిష్ట కథకుడు తిలక్‌. కథావస్తుసేకరణలో గోర్కీ చూపూ, కథానిర్వహణలో మొపాసా నేర్పూ, వెన్నెముకలాంటి తాత్త్వికతావిస్తరణలో రసెల్‌ కూర్పు వల్ల తిలక్‌ కథలు జనం నుండి ఉద్భవించి జనం బలహీనతలపై సెర్చిలైట్‌ వేస్తాయి. '.... ప్రతి జీవితం ప్రత్యేక జీవితం ఒకరికీ మరొకరికీ సంబంధం లేదు'... అని ఓ కథలో తిలక్‌ అన్నట్టు తన కథలోని పాత్రలన్నీ అనేకానేక సామాజిక సమస్యల వలయాల్లో తమతమ వ్యక్తిత్వాలను సందర్భానుసారంగా ప్రకటిస్తూ, మానవత్వం భిన్నకోణాలను ప్రదర్శిస్తాయి. ఇలా ఉండడం చూసి ఎలా ప్రవర్తించి ఉంటే సమాజం ఉన్నత పథాలవైపు వెళుతుందో ఆలోచించుకోమన్న సూచన పాఠకులకందిస్తాడు తిలక్‌. సమాజం ఎలా నడుస్తోందో, మానవత్వం ఎలా ఎన్ని విధాలుగా పతనమవుతోందో రూపుకట్టిస్తాడు. కారణాల వెతుకులాట శ్రమ పడాల్సింది పాఠకులే, తన కథలు ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలన్న భావం తిలక్‌కు ఉన్నట్టు కనిపించదు. తన సమకాలిక యువ రచయితల మాదిరిగా సవిమర్శక వాస్తవికతా దృష్టి ఉన్న అభ్యుదయ రచయిత. సాంప్రదాయనీతికీ, మతానికీ ఇచ్చిన ప్రాధాన్యం, మానవత్వానికి ఇవ్వని సమాజాన్ని చూసి కలతచెందడం తిలక్‌ రచనల్లో చూడగలం.
           'ఎవర్నీ నమ్మక ఈ మనుషులందరూ దొంగ వెధవలు - విష సర్పాలన్నది' తిలక్‌ సగటు పాత్రల అభిప్రాయం. 'స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కల్గించనంతవరకే' అన్నదీ, 'సముద్రం లాంటిదే దరిద్రం కూడా అవతలి ఒడ్డు కనబడదు' అన్నదీ, దాన్ని అంటిపెట్టుకొని ఆవరించే ఆకలిని గురించి 'రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు' అన్నదీ తిలక్‌ దుర్భిణీ చూపుతో పసిగట్టిన సామాజికాంశాలు. తిలక్‌ స్త్రీ పాత్రల్లో తెలివిమీరినతనం, బతకనేర్చినతనం సమపాళ్ళల్లో ఉంటాయి. 'ఈనాటి రచయిత వస్తు స్వరూపాలకూ, సంఘర్షణలకూ, శక్తులకూ కీలకస్థానం మీద శక్తివంతమైన బాట్రీలైట్‌ ఫోకస్‌ చెయ్యాలి' అన్నది తిలక్‌  భావం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good