కృష్ణశాస్త్రి గారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకు సంబంధించినది. రెండోది ఆలోచనకీ వ్యక్తికీ సంబంధించినది. కవిత్వానికీ సంగీతానికీ సన్నిహిత సంబంధం ఉందని శాస్త్రిగారి అభిప్రాయం. కవిత్వం సంగీత స్థాయికి ఎదగాలంటారు. 'కవిత్వంలో శబ్దం పలకడమే కాదు - పాడుతుంది. వచన కావ్యానికీ, పద్య కావ్యానికీ ఉన్న తేడా గమన తీవ్రతే అంటాడు' మిడిల్‌ టన్‌ మర్రే. ఈ గమన తీవ్రత సాధించడానికే పద్య నిర్మాణంలో శబ్దాలను మరీ సార్ధకంగా ఏరడం, మరీ బిగువుగా చేర్చడం, వింత వింత ఛందస్సులలో కూర్చడమున్నూ, భావగీతం వంటి పద్యకావ్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి శబ్దం పాటే అయిపోతుంది.
ఇంకా ఇలా అంటారు శాస్త్రిగారు - 'మంచి పాటలు వ్రాసేవాడికి. నిజమైన పాట వ్రాసేవాడికి లోపల కూడా అంతరాంతరాల్లో సంగీతం వచ్చి ఉండాలి. ఏ అనుభూతికి ఏరాగమో, ఏ వరసో, ఏ విరుపో, ఎక్కడ ఏ నొక్కో, ఏ ఒదుగో, సరిగా మాటా అవీ కలిపి వస్తాయి. నేననుకుంటాను గేయానికి ఎక్కువ నగలు తొడగగూడదని - శబ్దార్ధలంకారాలూ అవీ ! వాటి బరువు పాటను ఎగరనివ్వదు. లోతులకు రివ్వుమని దిగనివ్వదు'.
ఎన్ని రకాల పాటలు రాశారో శాస్త్రిగారు. తెలుగు ప్రపంచమంతా తన పొలాలతో, గట్లతో, కాలవలతో, పాటక జనంతో, పిల్లలతో, స్త్రీలతో, వాళ్ళ ఆనందాలతో, ఆశలతో, దు:ఖాలతో వాటిల్లో ప్రతిఫలిస్తుంది. తెలుగు ఇళ్ళల్లో, వీధుల్లో, పెళ్ళి పందిళ్ళల్లో, చేలల్లో, తోటల్లో, కాలవగట్లమీదా యుగయుగాలుగా నిగ్గుతేరిన పదాల, జావళీల నుడికారపు అందం, మల్లెపూల సొగసు, విరుపుల ఒయ్యారమూ ఆయన పాటలనిండా విరిసి మనల్ని అలరిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good