'శబ్దవిరించి' అంటే శబ్దసృష్టి చేసేవాడు. శబ్దమే బ్రహ్మము. దానిని సృష్టి చేయడం మానవ సాధ్యం కాని పని అని పెద్దలు అంటారు. అందుచేత కవి శబ్దసృష్టి చేస్తాడనటం కంటే శబ్ద పున:సృష్టి చేస్తాడనడం సమంజసం. శ్రీశ్రీ ఇందులో పలుపోకడలు పోయాడు. శబ్దాలకు పరినిష్ఠితమైన పూర్వార్థాలను మార్చి సరికొత్త అర్థాలలో ప్రయోగించటం ద్వారా ఒక నూత్నదీప్తిని కలిగించాడు. మహాప్రస్థానము, ఋక్కులు, అవతారము, బొమ్మలాంతరు వంటి పదాలు ఇలాంటివి. ఒక పదంలోని కొన్ని అక్షరాలను మార్చడం ద్వారా, మరొక పదాన్ని గానీ మరికొన్ని అక్షరాలను గానీ చేర్చడం ద్వారా కొత్త అర్థాన్ని స్ఫురింపజేసే కొత్త పదాన్ని సృష్టించడం, శ్రీశ్రీ ఇందులో కడు నిపుణుడు. అరవింగ ఘోస్టు, ఫస్టోబరు, ఫిలోఫర్లు, ప్సామవేదం, ఆహాశ్చర్యం, రోమలక్ష్మీపతి, దోమసుందరుడు, చిల్లిముంత - ఏకవీరుడు ఇలాంటి పదాలు చాలా సృష్టించాడు శ్రీశ్రీ. అన్యాపదేశ రచనలో వ్యంగ్య స్ఫూర్తి కారణంగా అర్థప్రాధాన్యం మారినపుడు వాగర్థసంపృక్తి కారణంగా శబ్దం కూడా కొత్తగానే భాసిస్తుంది.

    ''ఓరి కూపస్థ భల్లూకం

    గోడపై రుద్రాక్ష పిల్లీ

    ఆటలోపల అరటిపండూ

    పాటలెందుకురా!''

    లోకంలో 'కూపస్థమండూకం' అనే నానుడి ఉంది. 'కూపస్థభల్లూకం' అని ఎవరూ అనరు. కానీ ఇక్కడ శ్రీశ్రీ లక్ష్యం వేరు. నారాయణబాబును దూషించాలి. సన్నిహితులలో నారాయణబాబుకు జాంబవంతుడనే వ్యవహారముంది. అతడిని ఉద్దేశించే శ్రీశ్రీ ఇక్క 'కూపస్థభల్లూకం' అనే పదబంధాన్ని సృష్టించాడు. వారిద్దరి మధ్య నలిగిన వివాదం, తెలిసినవారికి ఈ పదబంధం వినగానే నారాయణబాబు స్ఫురణకు వస్తాడు. 'అభిసారికి కడసారికి' అనే గేయంలో 'పోకు పోకు నేస్తం - నాచునిండిన కోనేరు'' అనే ప్రయోగం కూడా ఇటువంటిదే. వ్యభిచరించి రోగాలపుట్టగా మారిన వేశ్య మర్మాంగాన్ని ఉద్దేశించి శ్రీశ్రీ ఇక్కడ 'నాచునిండిన కోనేరు' అని ప్రయోగించాడు. వ్యంగ్యస్ఫూర్తి కారణంగా పాఠకుడికి ఇక్కడ నాచూ కనబడదు, కోనేరూ కనబడదు. కనబడేది వేరొకటి. శబ్దసృష్టిలోని లాఘవం కారణంగానే శ్రీశ్రీ ఈ అర్థాన్ని సాధించాడు. సామాన్యార్థంలో వాడుకలో ఉండే పదాలకు కొత్త నిర్వచనాలను ఇవ్వడం ద్వారా, కొత్త వ్యుత్పత్తులను చూపడం ద్వారా ఆ శబ్దంలో ఒక నూతన స్ఫురణను కలిగిస్తాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good