ప్రతికవీ కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పినట్లే, త్రిశ్రీ కూడా 'కవిత్వం కావాలి కవిత్వం' రాశాడు. కవి అన్నవాడు ఎట్లా ఉండాలో '    అతడు అక్షరానికి మాతృదేశం' పోయెంలో చెప్పాడు. మనిషి ఎట్లా పొగరుగా సాధికారంగా ధిక్కారంగా ఉండాలో అనేక కవితల్లో ప్రస్తావవశంగా చెప్పాడు. ఇవన్నీ శ్రీనివాస్‌ కవిత్వంలో ముఖ్యమైన, కీలకమయిన పద్యాలే. వాటిలో ఆవేశం, స్వాభిమానం, ఒకింత అహంకారం - అతని ప్రకటనలను కవిత్వంగా మలిచాయి. కానీ, అతనికి అవి మాత్రమే చాలా ఇష్టమైనవని చెప్పలేము. 'ద్వీపవతి' కవితను అతను ఎంత ఇష్టపడి రాసుకున్నాడో, రాసి ఇష్టపడ్డాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అజంతా గుప్పుమంటున్నా 'నిశ్శబ్దం సాకారమై పరిమళిస్తుంది' పోయెంను ఎంత ప్రేమించాడో కూడా నాకు తెలుసు. కవిత్వం అతని దృష్టిలో 'అక్షరఖచిత భాష'. పొదగడం తప్ప అతను పూసగుచ్చలేడు. పోగుపెట్టలేడు. ద్రాక్ష విత్తనాన్ని తపస్వి ముత్యపు శిల్పంగా పోల్చిన గాఢత కానీ, పుస్తకం తనను తిరగేయాలని, కవిత్వం తనను రాయాలని, ఎండలు వానలకు తడిశాయని - చేసిన అనేక విలోమ ఊహలు కానీ 'రహస్యోద్యమం'లో అడుగడుగునా మనలను ఆశ్చర్యపరుస్తాయి. 'రహస్యోద్యమం' పుస్తకం వచ్చినప్పుడు - ఫెటీల్మన్న చప్పుడు. దేనినో అధిగమించినట్లు, బకాయిపడ్డ నిట్టూర్పుకు విముక్తి లభించినట్టు, కవిత్వానికి అంతకుమించి సార్ధకత ఏముంటుంది?

    త్రిపురనేని శ్రీనివాస్‌ రహస్యోద్యమ కవితలకు రహస్తాంత్రికుడు 'మో' ఇంగ్లీషు అనువాదాలను కలిపి వేస్తున్న పుస్తకం ఇది. పాఠకులుగా ఒకరికొకరు ఇష్టులే కానీ, కవులుగా ఇద్దరి కోవలు వేరు. సకల మర్గాల తెలుగు కవులను అనువదించిన 'మో'కు త్రిశ్రీ కఠినుడేమీ కాదు కానీ, ఎందుకో, కొన్ని పద్యాలు హడావుడిగా అనువదితమయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్వేచ్ఛ ఎక్కువ తీసుకోవడం పరవాలేదు. మూలకవి భావానికి మరీ ఎడంగా ఉన్న సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తాయి. శ్రీనివాస్‌ ఉన్నప్పుడే 'మో' ఈ అనువాదాలు చేశారట. ఆ తరువాత అయినా 'మో' ఒకసారి చూసి ఉంటే కొన్ని పొరపాట్లు లేకుండా ఉండేవి. - కె.శ్రీనివాస్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good