చిత్రకారుడు కుంచెనే కాక, కలాన్ని కూడా సమాన ప్రతిభతో నడిపించగల నేర్పరి అయితే, ఆయన కుంచె మంచి చిత్రాలేకాక, కలం నుంచి ఇతర చిత్రకారుల జీవిత చిత్రాలు కూడా హృద్యంగా వెలువడుతాయి. అటు కలాన్ని, ఇటు కుంచెను సమాన ప్రతిభతో నడిపించగల సామర్ధ్యం కలదు కనుకనే టీ.వీ. (టీ.వెంకట్రావు) గారు చిత్రకారుల మధ్య రచయిత, రచయితల మధ్య చిత్రకారులైన సవ్యసాచి. తాను అప్పుడప్పుడు వివిధ పత్రికలలో వెలువరించిన వ్యాసాలను ఏర్చి, కూర్చి, ''ప్రఖ్యాత చిత్రకారులు, శిల్పులు'' అన్న శీర్షికతో ఒక గ్రంథంగా ప్రచురించడం చిత్రకళా ప్రియులకు అమూల్యమైన కానుక. ఇందులో 15వ శతాబ్దికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్‌ చిత్రకారుడు లియోనార్డో లియోనార్డో డావిన్సీ (మోనాలిసా' ఫేమ్‌) దగ్గరనుంచి ప్రపంచ ప్రఖ్యాత ఆంధ్ర చిత్రకారుడు దామెర్ల రామారావు వరకు ఎందరెందరో దేశ, విదేశ చిత్రకారుల ప్రసిద్ధ చిత్రాలతోపాటు వారి సంక్షిప్త జీవిత రేఖా చిత్రాలు వున్నాయి. ఇందులో ప్రపంచంలో చిత్ర, శిల్పకళాకారులందరి జీవిత చరిత్రలూ వుండకపోవచ్చు. అయితే విభిన్న చిత్ర కళారీతులను కరతలామలకం చేసుకున్న టీ.వీ. గారు ఆయా చిత్ర, శిల్ప కళా రీతులలో నిష్ణాతులైన వారి జీవితాలను ఉదాహరణ ప్రాయంగా పేర్కొన్నారని చెప్పవచ్చు. అందువల్ల ఈ గ్రంథం చిత్ర, శిల్ప కళాప్రియులకు కొంగుబంగారం; ఒక రిఫరెన్స్‌ గ్రంథం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good