సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్‌ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

కిషన్‌ చందర్‌ 1914 నవంబర్‌ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌, రష్యన్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.

ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం - కిషన్‌ చందర్‌ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. ''గాలిబ్‌ వారసుడు''గా సాహితీ లోక సమాదరణ పొందిన కిషన్‌ చందర్‌ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.

ఈ నవలకు పెట్టిన ''పేకముక్కలు'' అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు - పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.

సినిమా జీవితం ఒక విలక్షణమైన జీవితం. మామూలు జీవితపు విలువలకిక్కడ చలామణీ లేదు. ఈ సంగతి తెలియగానే మామూలు జీవితపు విలువలను సునాయాసంగా విసర్జించేస్తారు కొందరు. మరి కొందరు వాటిని గాఢంగా అంటిపెట్టుకుంటారు. ఆ కారణంగా నలిగి హూనమైపోతారు. అంతులేని ఆశనూ, అగాధమైన నైరాశ్యాన్నీ రేకెత్తించగల విచిత్ర జీవితం సినిమా జీవితం.

జీవితాన్ని వాస్తవంగా చిత్రించటమే ఒక విశేషం కాదు. డిటెక్కివు నవలల్లో కూడా వాస్తవ జీవితమే ఉన్నది. ఈ నవలలో సినిమాకారుల జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించటంలో సరిపుచ్చుకోక, రచయిత ఆ జీవితంలోని సత్యాలన్నిటినీ నగ్నంగా ప్రదర్శించారు. ఆ కారణంచేత ఇది ఉత్తమ రచన అనిపించుకుంటుంది. ఎప్పటికైనా సినిమా కళ ఉన్నతికి రావాలంటే, అందుకు జరగదగిన కృషిలో ఈ నవల ఒక భాగమవుతుందా అంటే, అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. - కొడవటిగంటి కుటుంబరావు

పేజీలు : 264

Write a review

Note: HTML is not translated!
Bad           Good