మల్లాది రామకృష్ణశాస్త్రిగారి సమగ్ర సాహిత్యంలో మూడవ సంపుటం అయిన ఈ సంపుటంలో రెండు సంపూర్ణ నవలలూ, ఒక అసంపూర్ణ నవలా, అయిదు నాటికలూ ఉన్నాయి. ఇందులో చేర్చిన నవలల్లో అత్యంత సుప్రసిద్ధమైనది 'కృష్ణాతీరం'. దీన్ని ఇందులో చేర్చకముందు దీనికి సంబంధించిన ఒక అపూర్వ సంఘటన- ఆనంద విషాదాలతో కూడుకున్నది సంభవించడం విశేషం. 'కృష్ణాతీరం' నవల కేవలం శిల్పాన్నీ ప్రదర్శించడానికి మాత్రమే చేసిన రచనకాదు. దీనికి ఒక విశిష్ట సామాజిక ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది - అది మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం. పెళ్ళి సంబంధాలు కుదుర్చుకోవడంలో మూఢ విశ్వాసాలను తొలగించుకోవడం, భార్యాభర్తలూ, తల్లిదండ్రులూ పిల్లలూ తమ తమ అహంకారాలూ దురభిప్రాయాలూ వదులుకుని తమ అనుబంధాలను అన్యోన్యంగా మలచుకోవడం, కుల మత వివక్ష పాటించకుండా మానవ సంబంధాలను ప్రేమపూర్వకంగా పెంపొందించుకోవడం ఎంత అవసరమో చూపిస్తారు ఈ నవలలో. అనేక ఉపకథలతో కూడిన ఈ నవలలో అన్నప్పచేత 'సీతమ్మ' కథ పురాణ కాలక్షేపంగానైనా, హృదయ రంజకంగా చెప్పిస్తారు రచయిత.

ఇక రెండవ నవల 'తేజోమూర్తులు'. ఈ నవలలో కథానాయకుడి తల్లిపేరు సీతమ్మ. ఒక పురుషుడి వలలో పడి మోసపోయిన స్త్రీ ఆమె. ''చీ-చెడబుట్టింది! పెట్టిన పేరు చెడగొట్టింది! అన్నారుట అందరూ! వెర్రివాళ్ళు కాకపోతే, - ఆ పేరెట్టినందుకు- సీతమ్మవారి కష్టాలన్నీ పడ్డది'' అనుకుంటాడు ఆమె కొడుకు. అతను బాగా భాగ్యవంతుడయాక, స్వగ్రామం వెళ్ళి, తండ్రిని - తన తల్లిని మోసం చేసిన వాడిని - ఎలా ఉన్నాడో  చూడాలని బయలుదేరుతాడు. 'తవిశిపూడి' గ్రామంలో అతనికి ఆప్తులతో పరిచయాలవడం, కొన్ని అపోహలూ భ్రమలూ తొలగిపోవడం ఈ నవలలోని ఇతివృత్తం.

Pages : 226

Write a review

Note: HTML is not translated!
Bad           Good