భావకవిత్వపు ప్రయోక్తా, ప్రచారకుడూ, కృష్ణపక్షానికి వెలుగుల రేడు, తెలుగు దనానికి సూటిదనాన్నీ, సాహిత్యం కమ్మదనాన్నీ కలగలిపి చిత్రసీమను సేవించిన స్వరార్చకులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.

దేవుని ఉనికి పట్ల ఉపేక్ష వహిస్తూనే నిరాకారుణ్ణి భజించిన భక్తకవి. దేశంలో మతం పేరిట జరిగే దారుణ మారణ కాండను 'మతం వద్దు గితం వద్దు, మారణహోమం వద్దు' అంటూ ఎలుగెత్తి జాతి, మతాల సమైక్యతను చాటిన లౌకికవాది.

''ఆకాశము నోసట పొడుచు అరుణారుణ తార' అంటూ ఆగామి కాలాన్ని ఊహించిన ఆశావాది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలనూ 'శాస్త్రీయ' ముద్రతో సుసంపన్నం చేస్తూ పలు గ్రంధాలు రాసిన రసవాది.
1964 నుండి మూగవోయిన గొంతుతో మౌన రాగాలు ఆలపించిన 'వాగ్గేయకారుడు'. స్వేచ్ఛా సమానత్వాల బావుటాలెత్తిపట్టిన కాల్పనిక కవిత్వంతో ప్రారంభించి, ప్రగతిశీల సాహిత్యపు తాత్వికతను ఆహ్వానించి, కొన్ని దశాబ్దాల పాటు తెలుగు కవిత్వ వడినీ, కవుల నడవడినీ ప్రభావితం చేసిన కులగురువు.
ఆ తరం కవులు అందరు ఒక ఎత్తు. కృష్ణశాస్త్రిగారొక ఎత్తు. వారిలో కృష్ణశాస్త్రి గారే కొంచెం ఎత్తు. పుట్టలోని పాములాగ, తెల్లవారి తలుపులు తట్టి వచ్చిపడే అతిథిలాగ, రేకులు విచ్చుకున్న వువ్వులాగ తనకు కవిత్వం వస్తుందనే కృష్ణశాస్త్రి గారు రాసిన వెండితెర పాటల పుస్తకమిది. ఇందులో శాస్త్రిగారు 71 సినిమాలకు రాసిన 162 పాటలున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good