కీలు బొమ్మ - నార్ల చిరంజీవి
రచయితా - రచనలూ.... బుడిబుడి నడకలూ, జిలిబిలి పలుకులూ, గలగల నవ్వులూ విరబూసిన చిన్నారి లోకంలో నిత్యచిరంజీవి నార్ల చిరంజీవి. ఈ పేరుతో అవిచ్ఛిన్నంగా ముడిపడేది ''తెలుగు పూలు''. మంచితనం, మానవత్వం, సౌకుమార్యం, సౌమనస్యాల కలనేత చిరంజీవి కవిత. రానున్న యుగంలో విసిరే సవాళ్ళను ధీశక్తితో ఎదుర్కొనగల సత్తా నేటి బాలలకందించే తపన తెలుగుపూలు పద్యాల్లో చూడచ్చు. ''కన్నతల్లి ఘనత కలనైన మరవకు'' ''దేశ జనులు తీయని బంధాల కలిసి బ్రతుకవలయు తెలుగుబిడ్డ'' అంటూ కన్నతల్లిని మరవద్దనీ, ఉదారచరితులకు లోకమంతా ఒకే ఇల్లనే భావనలతో దేశభక్తీ, సమైక్యశక్తీ రంగరించి నేర్పాడు. ''ఆటపాటలు, కొత్తపాటలు, జాబిల్లి పాటలు, ఎర్రగులాబి'' లాంటి బాలగేయాలన్నింటా ఆరోగ్యకరమైన భావనలను, ఆనందకరమైన వర్ణనలతో ఆమోదయోగ్యమైన పదాల మధ్య, ఉత్తేజకరమైన ఊగు-తూగుల నడకలతో స్ఫురింపచేశాడు. ఇందులో కరుణరసానికి ఎత్తిన పతాక ''ఎర్రగులాబి''. గేయ రచనకు దీటుగా చిరంజీవి వచన రచన సరళ పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో, సూటైన భావాలతో పాఠకుల నాకట్టుకొంటుంది. ''ఆటపాట, మామకథలు, నీతికథానిధి'' - వంటి కథాసంకలనాల్లోనూ, ''పేనూ-పెసర చేను, కీలుబొమ్మ, మందారబాల, వీధి గాయకుడు వంటి నవలల్లోనూ చిరంజీవి కథన శక్తి, కథావస్తు నిర్వహణా నైపుణ్యానురక్తీ పాఠకులను ఆకర్షిస్తాయి. బాలల్లో ఆలోచనాశక్తినీ, హేతువాద దృష్టినీ పెంచాలన్న భావంతో ''మధురం'', ''ఆలోచన'' అన్న రచనలను చేశాడు.
- చిరంజీవుల సాహిత్యాకాశంలో నిత్యం వెలుగొందే తార నార్ల చిరంజీవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good