రవీంద్రుని సాహిత్యాన్ని అనువదించే యత్నాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారికి గీతాంజలిని మళ్లీ పరిచయం చేస్తున్నారు టేకి వీరబ్రహ్మంగారు. ఇది కేవలం వచనానువాదం కాదు. మాటల్లోను, పాటల్లోనూ టాగోర్ ఆధ్యాత్మికతను, మార్మికతను, పొందుపరిచారు ఈ రచయిత. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ఈయన ప్రవృత్తి మాత్రం కవితా సౌధ సుందర నిర్మాణం. ఇప్పటికే ఎన్నో వచనానువాదాలు వెలువడినా, వచనాన్నీ, గీతాన్నీ, ఏకకాలంలో అనువదించి అందించడం ఈ రచన విలక్షణత. రవీంద్రుని ఆలోచనాసరళికి దూరం కాకుండా, మధురంగా, స్వేచ్ఛానువాదం చేసారు రచయిత శ్రీ బ్రహ్మంగారు. స్వతంత్ర రచన కంటే అనువాదం కష్టమనే భావం ఉంది. అందులో కవిత్వాన్ని అనువదించం మరీ కష్టం. మూలంలో ఉన్న భావాన్నీ, అందాన్నీ, చెక్కు చెదరకుండా, మొక్కపోకుండా, పదిలంగా, ఇంకో భాషలో ప్రకటించాలి. కొన్ని భావాలు ఒక భాషలో ఒదిగినంత చక్కగా ఇంకో భాషలో పలకవు. ఈ సాధక బాధకాలను ఎదుర్కొంటూ, టాగోర్ భావాలను చక్కగా తెలుగులో ఆవిష్కరించే ప్రయత్నం చేసారు ఈ రచయిత.
కవిత్వాన్ని అనువదించే వారికి నిజమైన కవితాహృదయం ఉంటే అనువాదాలు సహృదయుల్ని అలరిస్తాయి. ఈ అనువాద రచనలోని వచనంలోనూ, గీతాల్లోనూ బ్రహ్మంగారి భావుకత వ్యక్తమౌతుంది.
ఇతర భాషాసాహిత్యాలపై రవీంద్రుని ప్రభావం అంతఃసౌందర్యానికి, అతీంద్రియతకు, అతిలోక రమ్యతకు, చెందినది. ఈ భావనల నిగూఢతను అవగాహన చేసుకుని, నిపుణంగా ఆంధ్రీకరించిన శ్రీ టేకి వీరబ్రహ్మం గారిని అభినందిస్తూ, ఈ అనువాద పరిమళాలను పాఠకులు ఆఘ్రాణించి ఆనందించగలరని ఆశిస్తున్నాను.
- దామెర వెంకట సూర్యారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good