జ్ఞానమంత పవిత్రమైంది ఈ ప్రపంచంలో మరొకటి లేదు.' జ్ఞానం పెరుగుతూ వుంటే మానవవికాసం జరుగుతూ వచ్చింది. మానవుడు విశ్వంలో తను చూసిన తన అనుభవంలోకి వచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలించి, విశ్లేషించి, వివరించే ప్రయత్నం చేసాడు. ఈ ప్రయత్నంలోనే మానవవిజ్ఞానం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా విస్తరించింది. మొదటి దశలో తన జ్ఞానాన్ని మనిషి మౌఖికంగా తన తరువాతి తరాలకు ప్రసారం చేసాడు. తరువాత లిపిని కనుక్కున్నాడు. లిపిలో తన జ్ఞానాన్ని బంధించాడు. జ్ఞానం లేఖన రూపాన్ని పొందడంతో దాని అభివృద్ధి వేగం నూరింతలుగా పెరిగిపోయింది.
మన సకల జ్ఞానానికి మూలాధారం. గణితం ఆ హేతువును అందిస్తుంది. అతిసామాన్య మానవుడి జీవితం కూడా గణితం లేకుండా ఒక్క క్షణం సాగదు. అందుకే 'లెక్కించనివారు లెక్కకు రారు' అని అనటోల్ ఫ్రాన్స్ అన్నాడు. ఈ మూడు లోకాల్లో కదిలేది కదలనిది ఏదైనా గణితం లేనిదే లేదు' అని మహావీరాచార్యుడు అన్నాడు. అంటే శాశ్వతమైన జ్ఞానంగా మానవుడి నిత్యజీవితంలో అనుక్షణమూ ఉపయోగపడే శాస్త్రంగా గణితం గుర్తింపు పొందింది. సకల శాస్త్రాలకు మూలం గణితం అన్నా ఆశ్చర్యం ఏమీలేదు. 'నూతనంగా అన్వేషించే జ్ఞానం ఏదైనా గణిత రూపంలో ఉంటుంది' అని చార్లెస్ డార్విన్ అన్నదాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు.
ఏ శాస్త్రమైనా అభివృద్ధి చెందింది అంటే అందులో అనేక శాఖలు ఏర్పడతాయి. శాఖలన్నింటికీ ఒకదానితో ఒకటి సంబంధంలేని విభిన్న అంశాలు కావు. వీటికి పరస్పర సంబంధం వుంటుంది. శాఖోపశాఖలుగా వృద్ధిచెందిన ఈ గణితశాస్త్రం మొత్తాన్ని ఒక్కచోట అందించడం అసాధ్యం. ఈ గణిత విజ్ఞానసర్వస్వములో గణితశాస్త్ర చరిత్రలో భాగంగా ప్రాచీన నాగరికతలలో గణితశాస్త్రభివృద్ధిని గురించి సవివరంగా పరిచయం చేయడం జరిగింది. సంఖ్యల గురించి వివరిస్తూ అద్భుత గణకులను పరిచయం చేయడం జరిగింది. గణితశాస్త్ర శాఖల వివరణ వుంది. వీటన్నిటితోపాటూ అనుబంధంలో గణితశాస్త్రానికి, ఇతరశాస్త్రాలతో వున్న సంబంధాన్ని, ఇతర విశేషాల్ని తెల్పడంతోపాటు గణితపట్టికలనివ్వడం, పారిభాషిక పదాలను వివరించడం జరిగింది.
విద్యారంగానికి సంబంధించిన విద్యార్ధులకు, అధ్యాపకులకు తప్పక ఉపయోగపడే పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good