జనతన సర్కార్‌ నేపథ్యంలో 2005 నుండి 2012 దాకా అరుణతారలో వచ్చిన పదిహేను కథలు ఇవి. ఇవ్వాల్టి అవసరంగా గత ముప్పై రెండేళ్ళుగా మూడు తరాలు తమ రక్తంతో, త్యాగాలతో నిర్మిస్తున్న పోరాటం ఇది. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం కొనసాగిన పోరాటం మరొకటి లేదు. ఫ్రెంచి విప్లవం 70 రోజులు మాత్రమే నిలిచింది. రష్యాలో 1906 సంవత్సరంలో బోల్షివిక్‌ పార్టీ ఏర్పడితే అక్టోబరు 1917 వరకు విప్లవం విజయవంతమయ్యింది. అట్లాగే చైనా విప్లవం 1919 నుండి 1949 వరకు విముక్తి సాధించింది. దండకారణ్యంలో ఇంత సుదీర్ఘ కాలం - విప్లవంలో మూడు తరాలు పాల్గొన్నాయి. కనుక ఇప్పటి తరానికి ఆరంభం నుండి మొత్తం సాహిత్యాన్ని అందించవలసి ఉన్నది.
ప్రపంచ సాహిత్యంలో నిలుపగలిగిన స్ధాయిలో యుద్ధ క్షేత్రం నుండి విప్లవాచరణలో ఉన్న రచయిత, రచయిత్రులు రాసిన ఈ పదిహేను కథలను ముందుగా ఒక సంకలనంగా విరసం ప్రచురిస్తోంది. అబూజ్‌మడ్‌ కొండల్లో - అనగా దండకారణ్యంలో నుండి అనేక దశలు దాటి విస్తరించిన ప్రజాసైన్యం, జనతన సర్కారు, మావోయిస్టు పార్టీ యుద్ధరంగంలో నుండి వెలువరిస్తున్న ఈ కథా సాహిత్యం మనకాలపు విప్లవ సాహిత్యం. ప్రపంచవ్యాపితంగా వచ్చిన , వస్తున్న సాహిత్యం కన&ఆన భిన్నమైన మనకాలపు మన నేల మీది సాహిత్యం ఇది. కథాంశం, శిల్పం, భాష, సంఘటనలు, వాతావరణం పాత్రలు పూర్తిగా భిన్నమైనవి. సంఘర్షణ నుండి, వర్గపోరాటం నుండి పుటం పెట్టబడి రూపొందినవి. ఈ కథలు కట్టుకథలు కాదు. పుట్టు కథలు. రచయితలు యుద్ధ రంగంలో నిలబడి ఒక చేత్తో తుపాకి మరొక చేత పెన్నుపట్టి రాసినవి. ఒక ఉద్విగ్న, ఉద్రిక్త తుఫాను గాలిలాంటి పెను సంరంభంలోంచి రాసినవి. వర్గ పోరాటాన్ని, మస్త లోతులతో వైరుధ్యాలతో - సంఘర్షణలతో చిత్రించడం ప్రపంచ సాహిత్యంలోనే మనకాలపు అరుదైన విషయం. - అల్లం రాజయ్య 

Write a review

Note: HTML is not translated!
Bad           Good