ప్రపంచమంతటా నేడు ప్రజాస్వామ్య ప్రభంజనం వీస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధలు ఏ రూపంలో ఉన్నా, రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛల కొరకు ప్రజలు ఆరాటపడుతున్నారు. నియంతృత్వ రాజ్యాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నా 21వ శతాబ్ది సాగిన కొద్దీ, ఆ దేశాలలో కూడా ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు జరుగుతాయని ఆశించవచ్చు.

వ్యక్తికి నిర్నిబంధమైన స్వేచ్ఛ ఉన్నంతమాత్రాన సరిపోతుందా? స్వేచ్ఛతోపాటు బాధ్యత, స్వాతంత్య్రంతోపాటు నిగ్రహం, ప్రతి పౌరుడూ పెంచుకోనక్కరలేదా? అలాకానిచో ప్రజాస్వామ్యం అరాచకంగా మారి, సామాజిక వ్యవస్థ ఉన్నత స్ధాయికి చేరకపోగా క్రింది స్ధాయికి దిగజారే ప్రమాదంలేదా?

ఆలోచనాపరులైన ప్రతిఒక్కరినీ ఇలాంటి సమస్యలు వేధిస్తున్న ఈ సమయంలో, ఈ గ్రంథం వెలువడటం ఎంతో సముచితం. ప్రపంచ రాజకీయ దార్శనికులలో రెండు తరహాల వారున్నారు. ఆ ధర్మాల కనుగుణంగా, సర్వజన శ్రేయస్సును స్ధాపించే సమాజాన్ని ఆకాంక్షించిన ఉదారవాదులు, ఊహాజనిత సమతావాదులు ఒక తరహా. ఈ గ్రంథంలో ప్రస్తావితులైన ప్లేటో, థామస్‌ మోర్‌, బేకన్‌, రూసోలు అలాంటివారు. వ్యక్తులు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలంటే, విద్యా విజ్ఞానాలుండాలి. ఆ లక్షణాలు కలిగిన ఉన్నత శ్రేణివారే పరిపాలనకు అర్హులు అని భావించిన వాస్తవిక వాదులు మరికొందరు. అరిస్టాటిల్‌, మార్టిన్‌ లూథర్‌, స్టూవర్ట్‌ మిల్‌ లాంటివారు మరొక తరహా. ఇది స్ధూల విభజన. ప్రజాస్వామ్యం, అరాచకానికి త్రోవతీయరాదని, పౌరులు నిగ్రహంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించే స్ధితి వచ్చేవరకు ఈ ప్రమాదం ఉంటుందని, పైన పేర్కొన్న దార్శనికులందరూ కంఠోక్తిగా చెబుతున్నారు. - ఏటుకూరు బలరామమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good