సృజన సాహిత్యప్రక్రియల మీద విమర్శ రాస్తున్న క్రమంలో సాహిత్యవిమర్శను, విమర్శకులను చదవడం, వస్తున్న సాహిత్య విమర్శ, పరిశోధనలమీద జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం, విమర్శగ్రంథాలను సమీక్షించడం, వ్యాసాలు రాయడం - నాకొక బాధ్యత అయ్యింది. ఈ బాధ్యతలోంచి ఈ వ్యాసాలు పుట్టాయి. 1988-2005 మధ్య దాదాపు మూడు దశాబ్దాలలో రాసిన ముప్పయ్యెనిమిది వ్యాసాల సంపుటి ఇది. తెలుగు సాహిత్య సృజనలో, విమర్శలో ఇవాళ రెండు పాయలు కొనసాగుతున్నాయి. 1. భౌతికవాద, చారిత్రక, వాస్తవిక పురోగమనపాయ, 2. ఆధ్యాత్మిక, భావవాద, అచరిత్రక, అవాస్తవిక తిరోగమనపాయ. ఈ రెండు పాయలమధ్య సంఘర్షణ అనివార్యంగానే జరుగుతున్నది. మొదటి పాయకు చెందినవాణ్ణిగా ఆ పాయద్వారా వచ్చిన విమర్శను ఆమోదించడం, రెండోపాయ ద్వారా వచ్చిన విమర్శను తిరస్కరించడం ఇదీ నా విమర్శ ధోరణి. నేను తిరస్కరించినవాళ్ళలో నా గురుతుల్యులు ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. ఆమోదించిన వాళ్ళలోనూ అంతే. ఎవర్ని ఆమోదించినా, తిరస్కరించినా వాళ్ళ వాదాలనే తప్ప, వ్యక్తులను కాదు. నేను వ్యతిరేకించిన వాళ్ళను వ్యక్తులుగా నేనింకా గౌరవిస్తూనే ఉన్నా నాకు ఆమోదయోగ్యం కాని వాదాలను అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శించాను. ఆమోదించిన వాదాలను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావించాను. అందువల్ల పునరుక్తి, పున:పునరుక్తి తప్పలేదు.
ఈ వ్యాసాలు కదలిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఉపాధ్యాయ, వార్త, ప్రజాసాహితి, అరుణతార, ఆంధ్రభూమి, విశాలాంధ్ర పత్రికలలోను, వివిధ గ్రంథాలలోను అచ్చయ్యాయి. - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good