బలిపీఠం - రంగనాయకమ్మ (పదకొండు ముద్రణలు పొందిన నవల) ...

నవలా రచయిత్రిగా రంగనాయకమ్మ గారికి పేరుతెచ్చిపెట్టిన నవల ఇది. దీని రచనా కాలం 1962 సంవత్సరం. సంస్కరణ ఇతివృత్తాన్ని తీసుకుని ఆమె ఈ నవల రాశారు. ఒక బ్రాహ్మణ వితంతువు (అరుణ), ఒక హరిజనుణ్ని (భాస్కర్‌) పెళ్లాడుతుంది. అయితే అపోహలు వారి కాపురాన్ని సజావుగా సాగనివ్వవు. చివరన అరుణ మరణిస్తుంది. ఒక వర్ణాంతర వివాహవైఫల్య కథ ఇది. నవల ఆరవ ముద్రణకి వచ్చే నాటికే రంగనాయకమ్మ గారి అభిప్రాయాలలో మౌలికమైన మార్పులు వచ్చాయి. అది '6వ ముద్రణకి ముందు మాట'లో మనకు కనిపిస్తాయి. ఒక రచయిత/రచయిత్రి తన నవలనే నిష్కర్షగా విమర్శించుకోవటం అరుదు. రంగనాయకమ్మ ఈ పనిచేశారు.

''ఈ నవల పూర్తి చేసేసరికి 'భాస్కర్‌ మంచి సంఘ సంస్కర్త' అనే అభిప్రాయం పాఠకులకు కలగవచ్చు. కానీ అసలు ఈ భాస్కర్‌ మంచి కమ్యూనిస్టు కావలసినవాడు. అతన్ని వెనక్కి మళ్లించి సంఘ సంస్కర్తని చేసింది. ఈ రచయిత్రి అజ్ఞానమే''నని రాసుకున్నారు రంగనాయకమ్మ. అయితే 'బలిపీఠం'లోని పాత్రల సమస్యలకు సమాజం యొక్క వర్తమానంతోనూ భవిష్యత్తులోనూ అతి సన్నిహితమైన సంబంధం ఉందంటారు 'పీఠిక'నందించిన సుప్రసిద్ధ కథకులు కొడవటిగంటి కుటుంబరావు గారు. మొత్తం మీద సమాజ స్పృహతో, కుల సమస్యను చర్చిస్తూ వెలువడిన ఈ నవల అందరూ చదువదగింది. ఈ నవలకు ప్రభుత్వ పురస్కారం కూడా లభించింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good