నిజాయితీ ఉన్న పాఠకుల్లో ఆలోచనలను రేకెత్తించగల్గే రచన ఉత్తమమైంది. అలాటి నవలల్లో వుప్పల లక్ష్మణరావు గారి ''అతడు-ఆమె'' నవల అగ్రశ్రేణిలో ఉంటుంది. తెలుగులో వచ్చిన అభ్యుదయ సాహిత్యాన్ని చదివే పాఠకులను 20వ శతాబ్దంలో వచ్చిన మంచి నవలల జాబితా రాయమంటే వారు రాసేదాంట్లో మొదటి పది గ్రంధాల్లో ఈ 'అతడు-ఆమె' తప్పక ఉంటుంది.
రాజకీయాలు వస్తువుగా తెలుగులో నవలలు రాసిన ప్రముఖుల్లో మహీధర రామ్మోహన్‌రావు గారి తర్వాత లక్ష్మణరావు గారినే చెప్పుకోవాలి. ఆయన తెలుగు నవలా సాహిత్యంలో ఓ కొత్త ప్రక్రియా వైవిధ్యాన్ని ''అతడు-ఆమె'' నవల ద్వారా ప్రవేశపెట్టారు. అది - పాత్రలు రాసుకొన్న డైరీల ఆధారంగా నవల నడవడం. మామూలు నవలల్లో రచయిత పాత్రలను తన భావాలకనుగుణంగా తీర్చిదిద్దితే, డైరీల ద్వారా రూపొందిన పాత్రలు తమను తామే తీర్చిదిద్దుకొంటాయి. వ్యక్తుల మధ్య సంబంధాలనూ, వారిపట్ల తమకున్న అభిప్రాయాలనూ నిర్మోహమాటంగా పాత్రలు వెల్లడిస్తాయి. ఇది డైరీ కనుక ఎదుటి పాత్రలను ప్రశంసించాలనో, ఏమనుకొంటారోననో తమ భావాలను దాచుకొని మభ్యపెట్టాల్సిన అవసరం పాత్రలకుండదు. ఇది వ్యక్తిగతం కనుక ఎవరో చదువుతారన్న భయమూ ఉండదు. అందుకే ఈ నవలలో ఉన్న పాత్రలు స్వభావసిద్ధంగా పెరుగుతాయి. సూటిగా మాట్లాడతాయి. జంకూగొంకూ లేకుండా సమాజంపట్ల, సమాజంలోని అనేకానేక అంశాలపట్ల తమ స్పందనను సరళమైన భావోద్రేకమైన భాషలో తెలియపరుస్తాయి. జాతీయోద్యమం, అందులో పాల్గొంటున్న అతివాద, మితవాద, సమన్వయవాద ధోరణులను పాత్రలు విపులంగా చర్చిస్తాయి. పాత్రలను ప్రజాస్వామిక రీతిలో పెరగనివ్వడం లక్ష్మణరావు గారు ఈ నవలలో చేసిన అద్భుతం.
లక్ష్మణరావు గారు సామాజిక బాధ్యత ఉన్న రచయితగా తన సాహితీసృజనను కొనసాగించారు. తాను నమ్మిన శాస్త్రీయ సోషలిజం ప్రచారాన్ని అన్ని కోణాలనుంచీ పరిశీలించి, తన రచనలద్వారా పాఠకుల్లో చైతన్యాన్ని కల్గించే కృషి చేశారు.
ఈ నవల మొదటిసారి ప్రచురితం అయినప్పుడు పాఠకుల్లో చాలా సంచలనం కల్గించింది. ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఏ.బి.కె.ప్రసాద్‌ రాసిన 'అతడు-ఆమె' అన్న చిన్న వ్యాసాన్నీ, ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి ఓల్గా గారు ''అతడు-ఆమె-మనం'' అంటూ గతంలో విపులంగా రాసినదాని సంక్షిప్తీకరణనూ నవలకు ముందు వెనుకలుగా చేర్చారు. ఈ నవలను విశ్లేషించుకోవడంలో పాఠకులకు ఈ వ్యాసాలు ఉపయోగపడ్తాయి. ఈ పునర్ముద్రణను పాఠకులు ఆదరంతో స్వీకరిస్తారని ఆశిస్తూ....

Write a review

Note: HTML is not translated!
Bad           Good