1984లో ప్రచురితమై పాతికేళ్ళపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట రచన. లేశమాత్రమైన కథాంశంతో, అనామకుడూ, అపరిచితుడూ ఐన నాయకుడితో, అద్భుతమూ, అపూర్వమూ ఐన అరణ్య నేపథ్యంతో తన రచనను ఒక పురాగాథ స్థాయికి తీసుకెళ్ళారు రచయిత శ్రీ కేశవరెడ్డి.
ఇందులో కథా సమయాన్ని రచయిత ఒకానోక సూర్యాస్తమయాన మొదలుపెట్టి సూర్యోదయానికల్లా ముగిస్తాడు. ఈ అస్తమయ ఉదయాల మధ్య పందుల్ని సాకే ఓ అనామక ముసలివాడి బహిరంతర అన్వేషణ. అడివిలో చిక్కులు చిక్కులుగా ముళ్ళుపడి, మానవ జీవితంలోని అస్తిత్వ సంఘర్షణగా సామాన్యీకరించబడి, తీగలు తీగలై నిర్నిరోధంగా సాగుతుంది. గుప్పెడు గంటల వ్యవధిలోనే కొన్ని కఠోర మరణాలు, ఇంకొన్ని అధివాస్తవిక జననాలు, సంక్లిష్ట సందేహాలు, గుబులు కొల్పే సందిగ్ధాలు, వెయ్యివెయ్యిగా తలెత్తే ప్రశ్నలు, భీతి కలిగించే హింస. విశ్వం మొత్తాన్ని గుండెల్లో పొదువుకునే అవ్యాజ ప్రేమభావం. అమాయక వాత్సల్యాలు, విశృంఖలత్వం, విహ్వలత్వం, వైవిధ్యం, మోహం, గూఢత్వం, మార్మికత్వం, నిష్ఫలత్వం, నిరర్ధకత, పాశవికత, నిస్పృహ, నిరీహ - ముసలివాడి అనుభవంలోకి నిరంతర ప్రవాహంగా ముప్పిరిగొని అతణ్ణి నివ్వెరపరుస్తాయి.
అతని అంతరంగం 'ఎక్కడో మొదలయి ఎక్కడో అంతమయ్యే' అరణ్యంగా, సిద్ధపరచిన యుద్ధరంగంగా సాక్షాత్కరిస్తుంది. మొత్తం కథ తాలూకు అనుభవంలో - అన్వేషణ ఒక్కటే వాస్తవం, సంఘర్షణ ఒక్కటే ప్రత్యక్షం.
జీవితం తాలూకు సంక్లిష్ట ప్రశ్నలకు తేలికపాటి, పనికిమాలిన, చచ్చు సమాధానాలనిచ్చి భ్రమలు గొలిపే దుస్సాహసం చేయదీ నవల. జీవితంలో ఉక్కిరి బిక్కిరిగా అల్లుకున్న కఠోరవైరుధ్యాలను, అధివాస్తవికంగా - నిర్మమంగా -కర్కశంగా - ధైర్యంగా ఆవిష్కరింపజేస్తూ. పాఠకలోకం ముందు బహుముఖీన మానవ అస్తిత్వాన్ని శక్తిమంతంగా ప్రతిష్ఠించడమే దీని ప్రత్యేకత. విశిష్టత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good