కేతకి ఒక కోయ యువతి, మొగలి రేకంత అందమైన ఆమె..స్వభావం మాత్రం మొగలి పువ్వంత రుకైనది. ఎందరో కోడెకారు యువకులు ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆమె ఒక తాంత్రీకుడి మీద మరులుగొంటుంది. అతి చిన్న వయసులోనే మంత్రశాస్త్రంలో అతి కఠినమైన విషయాలనెన్నింటినో సాధన చేసి అణిమాది అష్టసిద్ధులు పొందినవాడు. అతడి పేరు తిమ్మడు.

ఆ రోజుల్లో ఒక రాజావారు అనేకానేక దేశాల మీద దండెత్తి కొల్లగోట్టి తెచ్చిన అపారమైన ధనరాశి మణిమాణిక్యాలు, బంగారం నల్లమల్లలోని చిట్టడవిలో ఒక గుహలో నిక్షిప్తం చేస్తూ ఆ తాంత్రికుడి సాయం కోరతాడు. ఆ తాంత్రికుడు తన వెంట పడిన కేతకిని ఆ ధనరాశికి బలిహారంగా సమర్పించి ఆమె ఆత్మను కాపలాగా ఉంచుతాడు. ఆ గుహకున్న ఒక పెద్ద బండరాయి తలుపు మీద ఆమె బొమ్మను చెక్కుతాడు. ఆ గుప్త నిధికి కాపలాగా ఉన్న కేతకి ఆ చుట్టు ప్రక్కలకి ఎవరినీ రానివ్వదు.

తిమ్మడి చేత హతురాలైన కేతకి ఆత్మ అతీత శక్తులు పొంది అతడి మీద పగబడుతుంది. 'జన్మజన్మలకి వెంటాడతాను! వెంటాడతాను!' అని ప్రతిన పూనుతుంది. తిమ్మడు మణిచంద్రభూపాల్‌గా జమిందారు ఇంట్లో పుడతాడు. కేతకి చంద్రరేఖగా పుట్టి అతడి కాముకత్వానికి బలి అవుతుంది. తిరిగి ప్రేత రూపం పొంది అతడి చావుకి కారణమవుతుంది. అతడు మళ్ళీ జయసూర్యగా అదే బంగళాలో పుడతాడు. అమెరికాలో మెడిసిన్‌ చేసొచ్చిన జయసూర్యను చంద్రరేఖ ఆత్మ పీడిస్తూ అతడి జీవితం విషాదాంతం కావడానికి కారణమౌతుంది. అతడు మళ్ళీ శ్రీచక్రగా పుడతాడు. గత జన్మ జ్ఞాపకాలు అతడిని కలల రూపంలో బాధఙస్తుంటాయి. కలలలో ఆమె ఆత్మ అతడిని వెన్నాడుతూ ఉంటుంది. గత జన్నమలలో శక్తి ఉపాసకుడూ, మారుతి ఉపాసకుడూ అయిన శ్రీచక్ర ఈ జన్మలో భైరవ గుహలో తాను నిక్షిప్తం చేసిన గుప్త నిధిని కైవసం చేసుకొన్న కథ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good