నవీన్‌ కథలు కుటుంబసంబంధాలు, మానవసంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపారధోరణిని వివరిస్తాయి. ఒక సాయంకాలం వేళ ఓ కాలేజీ స్టూడెంట్‌, సిటీలో రోడ్డు వెంట వెళుతున్నప్పుడు మనస్సులో అవిచ్ఛిన్నంగా వచ్చే భావధారను 'అథోలోకం' కథలో చూడవచ్చు. బుద్ధి వారిస్తుంటే, మనస్సు వాంఛించే ఘర్షణలో, మనస్సే జయించి డామినేట్‌ చేస్తే మనిషి 'అథోలోకం'లో పడిపోతాడని ఈ కథ నిరూపిస్తుంది.

''తీరిన కోరిక'' కథలో అందమైన కలలతో, ఆధిక్యతా భావంతో ఊహా ప్రపంచంలో బతికే భర్త. ప్రాక్టికల్‌గా ఆలోచించే భార్య. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని చక్కదిద్దుకునే క్రమంలో భార్యను అపార్థం చేసుకున్న భర్త. నిజం తెలిసి తలవంచుకోక తప్పదు. ఆధిక్యతా భావంతో ప్రవర్తించే భర్త ఈ కథలో కనిపిస్తే, ఆత్మన్యూనతతో బాధపడే నాయకుడు ''హత్య'' కథలో కనిపిస్తాడు. ఇందులో రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసే గురవయ్య, స్వభావరీత్యా మందకొడితనంతో వుంటాడు. ఎంతోమంది ఆఫీసర్లు ఆయనను మార్చాలని విఫలమవుతారు. కృష్ణమూర్తి అనే ఆఫీసర్‌ మాత్రం అనేకసార్లు మందలించి చివరకు సస్పెండ్‌ చేస్తాడు. దాంతో కోపగించిన గురవయ్య ఆఫీసర్‌ను చంపేయాలనుకుని గుడ్డలతో బొమ్మను చేసి గుండుసూదులు గుచ్చి గోతిలో పూడ్చేసి చంపాననుకుని ఆనందంగా గాలి పీల్చుకుంటాడు. మరునాడు ఆఫీసర్‌ గుండెపోటుతో మరణిస్తే తను చేసిన చేతబడి వల్లే చనిపోయాడనుకొని తానే చంపేసినట్లు అందరికీ చెబుతాడు. ఎవరూ నమ్మకపోయేసరికి పోలీసు స్టేషనుకు వెళ్ళి ఆఫీసరును తానే చంపేసినట్లు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు నమ్మలా. ఆఫీసర్‌ చావుకు తనే కారణమన్న అపరాధ భావనతో మానసికంగా నలిగిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. ''అపకారికి ఉపకారం'' కథలో, మన పాత పరిచయస్తులు, పాత స్నేహితులు కలిస్తే ముందట అందరూ మంచిగా మాట్లాడుతారు. అతడు కాస్త కనుమరుగుకాగానే అతని మీద వున్న పుకార్లను నమ్ముతూ, ఇంకొకరికి చెబుతూ అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. దాని వెనుక వున్న కారణాన్ని మనస్తత్వ విశ్లేషణ ద్వారా తెలియజేయడం బాగుంది. - కె.పి.అశోక్‌కుమార్‌

Pages : 110

Write a review

Note: HTML is not translated!
Bad           Good