ఈ సంపుటంలో ఎనిమిది నాటకాల్లో మూడు స్త్రీల సమస్యలను గురించినవి. వీటిని స్త్రీవాద రచనలని గూడా అంటారు. ఈ మూడు నాటకాలూ ''పెళ్ళి'' అనే విషయం చుట్టే తిరుగుతాయి. ''పెళ్ళి మగాడి జీవితంలో వో మలుపు. స్త్రీకి మాత్రం పెళ్ళే గమ్యం'' అంటారు. భారతదేశంలో అనాదిగా స్త్రీల జీవితాలన్నీ 'పెళ్ళి' అనే గమ్యం చుట్టే గిరికీలు కొడుతున్నాయి. (సీత, ద్రౌపదుల దగ్గరి నుండి నేటి వరకూ) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పరిణీతలో కథ కూడా అదే. శరత్‌ స్త్రీ పాత్రల గతుల్ని మార్చింది గూడా పెళ్ళే! పెళ్ళి తప్ప మరో గమ్యం లేని నిర్భాగ్య బ్రాహ్మణ బాలికల్ని తల్లే కాశికి తీసుకెల్లి స్వయంగా గంగలో ముంచి కడతేర్చడాన్ని శరత్‌ ఒక నవలలో దయనీయంగా చిత్రిస్తాడు. శరత్‌దే అయిన ''బ్రాహ్మణపిల్ల'' ఒక అమ్మాయి తనను వూరించీ, వేధించీ, చివర్లో పశ్చాత్తాపపడి 'నీ కోసం పెళ్ళినే త్యాగం చేస్తా' ననే యువకుడితో ''స్త్రీకి పెళ్ళే గమ్యమనుకుంటున్నావా? నా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చూసుకోవల్సిన బాధ్యత పెళ్ళికంటే గొప్పది నాకు, పోపొమ్మంటుంది. ఆకెళ్ళ ఈ మూడు నాటకాల్లో ప్రధాన పాత్రలు స్త్రీలకున్న దురవస్థలను ప్రతినిధులుగా మాత్రమే కాకుండా, ''బ్రాహ్మణపిల్ల'' నాయికకున్న ఆత్మగౌరవానికి గూడా వారసురాళ్ళు కనిపిస్తారు. అలా ఈ నాటకాలు మూడూ వొక గొప్ప భారతీయ సాహితీ సంప్రదాయానికి కొనసాగింపులుగా రూపొందాయి.

''కాకి ఎంగిలి''లో జయ 'ఆడపిల్లకి బొడ్డుతాడు కోసిన దగ్గరినుంచీ పసుపుతాడు ముడేయించాలనే ఆరాటమేనా?' అని ప్రశ్నిస్తుంది.

''క్రాస్‌రోడ్స్‌''లో సుజాత భర్త దుర్మార్గుడని తెలిశాక, ఆ దాంపత్యానికి న్యాయబద్ధంగా వీడ్కోలు చెప్పడానికి సందేహించదు. 

''ఎయిర్‌ ఇండియా'' నాటకంలో వసంత విదేశీ జీవితాల మోజుతో ఆడపిల్లల్ని మోసగాళ్ళకిచ్చి పెళ్ళి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. 

ఈ మూడు నాటకాల్లోనూ ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే చిత్రించబడ్డాయి. ఈ ముగ్గురు నాయికలూ ఆధునిక మహిళకు కావలసిన ధైర్య సాహసాలకు ప్రతీకలుగా రూపొందారు.

ఇప్పుడు మనిషి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాల్లో కామానికీ, కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలనే ఆరు బలహీనతలకూ లొంగిపోయి, ధన సంపాదన కోసం అన్ని మానవీయ విలువలనూ విస్మరిస్తున్న తీరును మూడో పురుషార్థం, ఆరు పిశాచాలు, అన్నా! జిందాబాద్‌ అనే మూడు నాటకాలు చిత్రిస్తాయి. గూండాయిజమూ, కుటిల రాజకీయాల గ్రహణంలో గొప్ప ఆదర్శాలన్నీ ఛిద్రం కావడమూ, మతమూ మానవత్వాలు, సంప్రదాయమూ అభ్యుదయాలు, పరస్పర విరుద్ధాలైన అంశాలుగా తయారైన సమాజంలో సాదా సీదా మనుషుల పరితాపాలను మిగిలి రెండు నాటకాలూ (ఓం, ఇదొక విషాదం) విమర్శకు పెడతాయి.

పేజీలు : 316

Write a review

Note: HTML is not translated!
Bad           Good