స్త్రీల ఉద్యమాలంటే స్త్రీ పురుషుల్ని వేరుచేసి, వారి మధ్య పోటీ పెట్టే ఉద్యమాలనీ, స్త్రీ పురుషపరంగా ఐక్యతను దెబ్బతీసే ఉద్యమాలనే ప్రతికూల ధోరణి విప్లవ శక్తుల్లో ప్రబలంగా వుంది. అవి వర్గ పోరాటాన్ని, విప్లవ పోరాటాన్ని, పక్కదారి పట్టంచే పోటీ ఉద్యమాలనీ, వాటిలోంచి పుట్టిన స్త్రీవాద సిద్ధాంతం మార్క్సిస్టు సిద్ధాంతానికి పోటీ సిద్ధాంతమనే ధోరణి కూడా బలంగానే వుంది. ఈ ధోరణి వల్లనే స్త్రీ ఉద్యమాల్ని స్త్రీవాద సిద్ధాంత ధోరణుల్ని పరిశీలించడం, అర్థం చేసుకోటానికి బదులు వాటిపట్ల విముఖత ప్రదర్శించి విస్మరించడం జరుగుతోంది. ఫలితంగా సమస్యని స్వయంగా అర్థం చేసుకోవటం, దానికి మార్క్సిస్టు సిద్ధాంత అవగాహనను అన్వయించటంలో విఫలమవటం జరిగింది. ఈ ప్రతికూల ధోరణిని పారద్రోలి స్త్రీల ఉద్యమాల్ని, స్త్రీవాద సిద్ధాంత ప్రతిపాదనల్ని అర్థం చేసుకోవటానికి, ఆలోచింప చేసుకోవటానికి ఈ వ్యాసాలు దోహదం చేస్తాయి. |