ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మి, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే 'ఆరోగ్య స్పృహ'తో ఈ పుస్తకాన్ని చదివేందుకు సమాయత్తమౌతున్న పాఠకలోకానికి నా అక్షర నీరాజనాలు!
తెలుగు పాఠకులలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనే ఆసక్తి గతంలో కన్నా చాలా పెరిగింది. రోజులు మారాయి. ఇప్పుడు అతి సామాన్యులు సైతం తమకు అర్ధం అయ్యే భాషలో ఆరోగ్యపరమైన అంశాలను ఎవరైనా సమర్థవంతంగా చెప్పగలిగితే, చక్కగా చదివి అర్థం చేసుకొని, వాటిని పాటించడం ద్వారా రోగాల పాలిట పడకుండా తప్పించుకోగల్గుతున్నారు.
ఆయుర్వేద వైద్యుడిగా నా అనుభవం, నా పరిశీలన, పరిశోధనల్లో నిగ్గుతేలిన వైద్య రహస్యాలెన్నింటినో ఏర్చి, కూర్చి అక్షరమాలగా అల్లి మా పాఠక హృదయాలను అలంకరింపచేయాలని, నిండు నూరేళ్ళూ మా పాఠకులు ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా జీవించాలని, రోగాలు రాకుండా నిరోధించుకునేందుకు నిత్యపారాయణం చేసే 'ఆరోగ్య భగవద్గీత'గా ఉపయోగపడాలని ఈ పుస్తకం రాసాను.
వేటిని అశ్రద్ధ చేస్తే ఆరోగ్యం కుప్పకూలి పోతుందో, వేటిని పాటిస్తే ఆయుష్షు నిండు నూరేళ్ళు నిలబడుతుందో వాటిని ప్రత్యేకంగా ఎంపికచేసి ఈ పుస్తకాన్ని మీకు అందిస్తున్నాను.
ఇవి పైకి చాలా చిన్న విషయాలుగానే కన్పిస్తాయి. కానీ, మీ జీవిత గమ్యాన్ని మరో మలుపు తిప్పగల అమృత గుళికలివి! మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం!! రండి! అమృతం నిండిన స్వర్ణభాండాలు... ఇవిగో..... అందుకోండి!! అందుకని హాయిగా ఆనందంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా అష్టయిశ్వర్యాలతో సుఖంగా జీవించండి!
- డా॥ జి.వి.పూర్ణచందు

Write a review

Note: HTML is not translated!
Bad           Good