షుగర్ వ్యాధిని తగ్గించుకోవటానికి ఆ వ్యాధిని బాగా అర్థం చేసుకోవటమే అసలు మందు. అది ఎవరి ముఖమో చూసి నిద్రలేచినందు వలన కలిగే వ్యాధి కాదు. మన పాత్ర, మన ప్రమేయం లేకుండా దానికదే షుగర్ స్థాయి పెరిగిపోవటం అనేది జరగదు. ఈ వ్యాధి రావటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పెరగటానికి మాత్రం కారణం ఒకటే. అదే అశ్రద్ధ!
షుగర్ వ్యాధిని ఎంత అర్థం చేసుకుంటే, ఆ వ్యాధి వలన కలిగే ఉపద్రవాలను అంత ఎక్కువగానూ, అంతకన్నా ముందుగా అపోహలను సరిదిద్దుకోవలసి ఉంది. షుగర్ ఉన్నదంటారని భయపడి పరీక్షలు చేయించుకోవటానికి వెనకాడటం, ఇన్సులిన్ ఒకసారి తీసుకొంటే ఇంక జీవితాంతం తీసుకోవాలసి వస్తుందనీ భయపడటం, చిన్న పిల్లలకు, తీపిని ఇష్టపడని వారికి షుగర్ వ్యాధి రాదనకోవటం, పుండు మాడుతుంటే షుగర్ వ్యాధి రానట్టేనని, వచ్చినా కంట్రోల్లోనే ఉండి ఉంటుందని, షుగర్ లక్షణాలు రాలేదు కదా.... అనే అతి నమ్మకాలు కొంపలంటిస్తాయి. వయసుతోనూ. వృత్తితోను, వంశంలో ఇతరులకు లేకపోవటంతోనూ నిమిత్తం లేకుండాఅ షుగర్ వ్యాధి ఎవరికైనా, ఎప్పుడయినా రావచ్చు. లక్షణాలు కనిపించాక చూద్దాం లెమ్మనుకోవటం వలన పదేళ్ళ తరువాత వచ్చే ఉపద్రవాలను ఇవ్వాళే నెత్తికి తెచ్చుకున్నట్టు అవుతుంది. షుగర్ పరీక్ష చేయించుకోవటానికి వెనుకాడే వారిలో మూడొంతుల మంది తమకు తెలియకుండానే ఈ వ్యాధిని మోస్తున్నారన్నది వాస్తవం.
మనం జీవిస్తున్న విధానం, మనం ఆలోచిస్తున్న విధానం, మనం ఆహారం తీసుకొనే విధానం... ఇవి షుగర్ వ్యాధి రావటానికి కారణాలు, వచ్చిన తరువాత ఈ మూడింటిని ఎంత మార్పు చేసుకొన్నాము అనే దాని మీద షుగర్ వ్యాధి అదుపు ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప డాక్టర్ దగ్గరకు వెళ్లామన్నది కాదు. ఎంత గొప్పగా వ్యాధి గురించి అవగాహన చేసుకొన్నాం అన్నది ముఖ్యం. వివరాలు అడిగే ఓపిక రోగికి లేక, చెప్పే తీరిక వైద్యుడికి లేక షుగర్ వ్యాధి అశ్రద్ధకు గురవుతోంది.
డాక్టర్గారు చెప్పిన మందులే వాడుతున్నాను. కాబట్టి, ఇంక షుగర్ వ్యాధి లేకుండా చేయాల్సిన పూచీ ఆయనదే ననుకోవటం పొరబాటు. మనం పచ్చి మిరపకాయ బజ్జీల బండి మీద దండయాత్ర చేస్తూ, డాక్టర్గారిని ఇంకా కడుపులో మంట తగ్గలేదేమిటని అడిగితే ప్రయోజనం ఎలా ఉండదో అలానే, మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకొని పాటించకుండా భారం అంతా వైద్యునిదే ననుకోవడం-గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అనటమే అవుతుంది.
ఆయుర్వేద మార్గంలో ఈ వ్యాధిని నివారించుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
- డా॥ జి. వి. పూర్ణచందు

Write a review

Note: HTML is not translated!
Bad           Good