తెలుగునాట బౌద్ధం బుద్ధుని జీవితకాలంలోనే బోధన్ నగర ప్రాంతానికి చేరినా, అశోకుని వలనే ధర్మవ్యాప్తి జరిగిందని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అమరావతిలో ఒక స్తంభశాసనం అశోకునిదిగా భావింపబడుతోంది. దీనిగురించి ఇంకా కొంత సంశయమున్నా తెలుగునాట బౌద్ధధర్మ విస్తరణలో అశోకుని పాత్రను గురించి ఏమాత్రం సంశయం లేదు. అశోకుని కాలంలో జరిగిన ధమ్మ - వినయ సంగీతిలో మన ప్రాంత (అందక) భిక్షువులు పాల్గొనడం, మహాసాంఘికావిర్భవ సూచనలు గోచరించడం వలన అప్పటికే ధర్మ విస్తృతి జరిగిందని భావించవచ్చు. బౌద్ధం ఆంధ్రదేశానికి మూల సంస్కృతి. ఈ సంస్కృతిని ప్రతిష్టించిన చక్రవర్తి అశోకమౌర్యుడు. ఈ చిన్నపుస్తకం బౌద్ధసాహిత్యంలోని, శాసనాలలోని అశొకుని పుర్వోత్తర చరిత్రలను తెలుపడమేగాక, అహింసా ప్రాతిపదికగా ఆయన రూపొందించిన రాజనీతిని తెలుసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. - ఆధ్యక్షులు ధర్మదీపం |