వరిపొలాల గమ్మత్తైన వాసన పంటకాలువ నీటి పరిమళంతో కలిసి గాలిలో తేలుతూ ఒళ్లంతా చుట్టుకుంటోంది. దారి పక్కన కరెంట్‌ తీగలమీద పేరు తెలియని ఏవో పిట్టలు కూర్చొని ముక్కులతో రెక్కల్ని పొడుచు కుంటున్నాయి. దూరంగా వెనకెక్కడో ఏదో రైలుబండి హారన్‌ మోగించు కుంటూ వెళ్తోంది. సాయంకాలపు సంజకాంతిలో భూమ్యాకాశాల్ని ఏకం చేస్తూ ఆడదాని పయిటచెంగులాగా తెల్లటి పొగమంచు పరచుకుంటోంది.
నవనాగరీక ప్రపంచానికీ, కరెన్సీ కట్టలమయమైన ఫిల్మ్‌ ఇండస్ట్రీకీ, ఆడంబరాలకీ, ఫైవ్‌స్టార్‌ ¬టళ్ల ఖరీదైన సౌఖ్యాలకీ దూరంగా… ప్రకృతి సోయగాలతో, కల్లాకపటం ఎరుగని మనుషులతో నిండిన పల్లెటూరికి పనిమాలా కోరుకున్నట్లు వస్తున్న తేజస్వి అనే సినీదర్శకుడు-
నిన్నటివరకూ గడచిన తన జీవితాన్ని మర్చిపోయి, కొత్త ఊహలతో, ఆలోచనలతో, కోరికలతో గుండె నాలుగుగదుల్ని నింపుకోవాలనీ, జీవితమనే పుస్తకంలో అక్షరం కూడా రాయకుండా ఖాళీగా మిగిల్చిన పేజీలో అనుభూతుల దృశ్యమాలికని చిత్రించుకునే ప్రయత్నంలో భాగంగా గతుకుల దారిలో కదుల్తూ ముందుకెళ్తున్న ఎద్దులబండిలో కూర్చొని ఉన్నాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good