బాబా చూపిన భక్తి మార్గం చాలా సరళమైనది. కఠినమైన నియమములను పాటించనవసరం లేదు. బాహ్య శుచి, ఆడంబరాలతో కూడిన పూజ పద్థతులతో పనిలేదు. కేవలం ఆయనపట్ల శ్రద్ధ, ఓరిమి వుంటే చాలు ఆయన దర్శనం సులభంగా లభిస్తుంది. కోరిన ఫలితం కరతలామలకమే.
''మోక్షం తప్ప నువ్వు నన్ను అడగకూడదు, నేను యింకేమి ఇ్వకూడదు'' అనే దేవుడిని ఎవడు ఆశ్రయిస్తాడు? మ్రొక్కినా కూడా వరమీయని వేల్పు(దేవుడు)ను వెంటనే వదిలిపెట్టాలని సుమతీ శతకకర్త చెప్పినట్లు మానవుడు తనకు కల్గిన కష్టాన్ని తక్షణమే తొలగించే శక్తి (దేవుడు)కై వెతుకుతాడు. ముందు కొంచెం ఆశతో ఒక దేవుణ్ణి కొలుస్తారు. అనుభూతి గలిగినపుడు నమ్మకమేర్పడి భక్తిగా మారుతుంది. ప్రస్తుతం మనదేశంలో నివశిస్తున్న ఎక్కువశాతం హిందువులు సాయిబాబాను నమ్మి సేవిస్తూ ఫలితాన్ని పొందుతూ సాయిభక్తిని ప్రచారం చేస్తున్నారు. ఈ చర్యను కట్టడి చేయడం ఎవరి తరం కాదు.
శిరిడీ సాయి బాబాపై అనేక నిత్య పారాయణ గ్రంథాలు వెలువడ్డాయి. నేను కూడా సాయి చూపిన లీలలను సంవత్సరాలు, తేదీలనుసారం విభజించి 'శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర'లో గ్రంథస్థం చేశాను. ప్రస్తుత రచన ''శిరిడీసాయి లీలా లహరి'లో మరికొన్ని లీలలను జోడించి సులభంగా పారాయణ చేసుకోవడానికి వీలుగావుండేట్లు విషయాన్ని సంకలనపర్చాను. భక్తులు చదివి మానసిక ప్రశాంతతను పొంది సాయి కృపకు పాత్రులౌతారని ఆశిస్తున్నాను. - డా|| కె.నిష్ఠేశ్వర్