ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆ చరిత్రలోకి పోయే సందర్భం కాదు కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను. శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్‌) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢిమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికి ఉండడం చాలా అరుదైన విషయం. ప్రచారంలోనికి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయత్నించడం వల్ల శేషేంద్ర పద్యరచనకు అందవలసిన గౌరవం అందలేదు. లేకుంటే శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాథ అయి ఉండేవాడు.

ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీన కావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రామణీయకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో మరీ ఎక్కువ పద్యాలు లేవు. ప్రతి ఋతువుకూ ఇన్ని పద్యాలు రాయాలనే నియమాన్ని కూడా కవి పెట్టుకోలేదు. రెండు ఋతువులగురించి అయితే ఆరు పద్యాలే రాశాడు. కాని ప్రతి ప్రకృతి పరిణామాన్ని ఒంటి నిండా గుండె నిండా అనుభవించి రాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది.

Pages : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good