రామచంద్రరాజుకు కథా నిర్మాణం మీద శ్రద్ధ ఉంది. శైలీ స్పృహ ఉంది. వివిధ తాత్త్వికుల, ఆలోచనా పరుల ప్రాపంచిక దృక్పథాల పట్ల అవగాహన ఉంది. తనదైన ప్రాంపంచిక దృష్టీ ఉంది. కథా నిర్మాణంలో అంతర్బాగంగా కలిసిపోయిన ఉల్లేఖనలూ, రాజు అక్కడకడ్కడ చేసే సూత్రీకరణలు ఇందుకు సాక్ష్యం.

'వెన్నెల దీపం' కథలో కథకుడు ఉపయోగించిన 'అసూర్యం పశ్య, సీతమ్మ అశోకవనంలో కుమిలి పోయినట్లు దు:ఖించాలని రాసి వుంది' అని పాత్రపరంగా చెప్పించిన ఒకటి రెండుచోట్ల తప్పిస్తే రాజులో పాండిత్యలౌల్యం కన్పించదు. ఒక భావకుడి కథన విశిష్టత మాత్రమే కన్పిస్తుంది.

ఉత్తమ పురుష కథనంలో మరీ నిద్రబోతున్న మనిషితనాన్ని మనలో లేపే కథలు 'నోలాంగ్‌బెల్‌ప్లీజ్‌', 'వెన్నెలదీపం', 'అవును నిజమే'. మొదటి రెండు కథలు మన గ్రామీణ ప్రాంతాల విద్యావ్యవస్థకు సంబంధించినవి. మూడవది పోలీసు యంత్రాంగానికి సంబంధించింది.

'నోలాంగ్‌ బెల్‌ ప్లీజ్‌'లోని కొత్త టీచరు రాఘవ నిబద్ధత పాఠశాల వాతావరణాన్ని మార్చివేస్తుంది. 'వెన్నెల దీపం'లోని కథకుడు అనాథగా మారిన హర్షవర్థన్‌ పట్ల చూపిన ఆపేక్ష లాంటి ఆపేక్ష సమాజంలో పెరుగుతూ పోవాలని అనుకుంటాము. పోలీసుల్లో కూడా వంచితులకు న్యాయం చేయాలనే దృష్టి ఉన్నవాళ్ళు ఉన్నారని తెలిసి, ఇట్లాంటి వాళ్ళుంటే ఎంత బాగుంటుంది? అనుకుంటాము.

'అవును నిజమే' దుబాయికీ, కువైట్‌కూ వెళ్లి నానా బాధలు పడి, స్వదేశానికి వచ్చికూడా పీడనకు గురి అయింది మహిళలే. ఆర్థికంగా దిగువన ఉండే వీళ్లు ఒకరకంగా హింసకు గురి అయితే ఆర్థికంగా పైనుండే ఇల్లాళ్ళు మరొక రకంగా బాధితులు. రాజు ఈ నేపథ్యాలలో వాస్తవికత ఉట్టిపడేట్లు పాత్రలను చిత్రించాడు.

రాయలసీమ జిల్లాల నేపథ్యంలో చట్టాలు చేసేవాళ్ళూ, చట్టాలను అమలు చేయాల్సిన వాళ్లు, అమలు తీరు తెన్నులను రాజ్యాంగ పరిధిలో రక్షించాల్సిన వాళ్ళూ, వీళ్లమధ్య ఉక్కిరి బిక్కిరవుతున్న వాళ్ళూ, ఏ యే విధంగా ఉన్నారో చూపించే కథలు ఇవి.

కలవరపెట్టే కథలు ఇవి.

బాథపెట్టే కథలు ఇవి.

ఇవి నిజం కథలు.

మనిషి తన కోసం ఎదురుచూడమని చెప్పే కథలు ఇవి.

మంచిమనిషి రాజు కథలు ఇవి.     - కేతు విశ్వనాథరెడ్డి

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good