మన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితినీ, సోవియట్‌ యూనియన్‌లో స్టాలిన్‌ వాదం పోషించిన పాత్రనీ సజీవంగా చిత్రిస్తుందీ నవల. భారతీయ సాహిత్యంలో ఇటువంటి ఇతివృత్తంతో రచించిన ప్రప్రథమనవల ఇది. అభ్యుదయ భావాలతో ఈ ప్రపంచాన్ని మార్చాలనీ మరో ప్రపంచాన్ని ఆవిష్కరించాలనీ భావించే కొన్ని ఆదర్శ పాత్రల్ని ఎత్తుపల్లాల తోవలు, అగాధాలు, అగడ్తలు, ఉత్థాన పతనాల పరిస్థితుల్ని అధిగమించి ఎలా పురోగమించిందీ చూపుతుందీ నవల.
వందలాది ప్రశ్నలతో సోవియట్‌ యూనియన్‌లోని పరిస్థితుల్ని విపులీకరించే ప్రయత్నం దీనిలో ఉంది. జీవితంలో అన్నింటికంటే విలువయిన లబ్ధి ఏమిటి? డబ్బా? ప్రేమా? అధికార దర్పమా? సాంసారిక భోగభాగ్యాలా? సాధారణ కుటుంబ జీవనమా? సిద్ధాంతాలతోకూడిన ఆదర్శవాదమా? ఆదర్శవాదుల పతనం ఎందుకు జరుగుతూంది? ఈ పద్మవ్యూహంలోనించి బయటపడే మార్గమేమిటి? ఇలాంటివే ఈ నవల లేవనెత్తే అనేకానేక ప్రశ్నలు.
సామ్యవాదం, మహిళా విముక్తి మొదలయిన పులకింపచేసే ఆలోచనలు ‘దూరపుకొండలు నునుపు’ అన్నట్లుగా దూరంనించి బాగానే అనిపిస్తాయి. కాని ఏదైనా తమదాకా వస్తేకాని తెలియదన్నట్లుగా ఆ సమస్యలు తమమీద వచ్చి పడ్డప్పుడు మనుషుల తీరు మారిపోతుంది. సిద్ధాంతం, ఆచరణ మధ్య అగాధాలెలాగు ఏర్పడతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good