భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ''వక్రీకరించి'' అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు - వాళ్లు ముస్లింలు అయినా, హిందువులు అయినా, అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.
శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.
'రాయఘడ్' రాజధానిగా ఆయన స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయటపడెయ్యడం కోసం ఆయన ఎన్నో ఘనకార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువును తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ''ప్రజల మనిషి'' అని ప్రజల మన్నన పొందాడు.
శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.