మేరీని పెళ్ళి చేసుకుంటానని విశ్వనాథం తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళెంత దెబ్బలాడారో - యీ నిశ్చయం విన్నాక అంతకు పదిరెట్టు పేచీపెట్టారు మేరీ తరపు వాళ్ళు. విశ్వనాథం - మేరీ యీద్దరూ థర్డ్‌ యమ్‌.జి.లో వుండగా - తమ స్నేహం మామూలు స్నేహం కాదని, ఇది ప్రేమ భావమనీ గ్రహించుకున్నారు. అయితే వీరి కుటుంబాలు రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. అవి కలవడమన్నది కలలోని వార్త అని తెలుసుకుని రెండు వైపులవారినీ ఎదరించి పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
విశ్వనాథం ఆంధ్ర శ్రోతియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తెల్లగా, బక్కపలచగా, ఆకర్షణీయంగా ఉంటాడు. నలుగురు అన్నదమ్ముల్లో రెండో వాడు. పెళ్ళిగావలసిన యిద్దరు చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ వున్నారు. బస్తీగాక, పల్లెటూరూ గాక మధ్యస్తమైన ఊరు వాళ్ళది. అది ఒక జమీందారిలోది. ఆ ఊళ్ళో నాలుగైదు భవంతులు జమీందారులవి వున్నాయి. కోట గుమ్మాలూ, విశాలమైన లోగిళ్ళూను. జమీందారీపై ఆధారపడ్డ కుటుంబాలూ, ఆ ఎస్టేట్లలో పనిచేస్తున్నవారి కుటుంబాలూ ఎక్కువ. ఆ ఊళ్ళో, విశ్వనాథం పూర్వీకులంతా ప్రభువు ప్రాపకంలో గడిపారు. తేనె తుట్టెలాగా తల్లివైపు - తండ్రివైపు బంధులవి పది పదిహేను కుటుంబాలున్నాయి స్వంత వూళ్ళోనే. అతని బంధువులందరిలోకి - వీళ్ళే కొంచెం సంపన్నులూ, చదువుకొన్నవారూను. విశ్వనాథం అన్నగారు రామ్మూర్తి హైస్కూల్లో హిస్టరీ టీచరు. ఆయనకి ఇద్దరు పిల్లలు. పెద్ద చదువులు చదివిన విశ్వనాథం - తమ వంశానికి గౌరవం, ఇంటికి ధనం తెస్తాడని ఆశపడ్డ తండ్రి కలలు కల్లలయాయి......

Write a review

Note: HTML is not translated!
Bad           Good