రామాయణం నిత్య పారాయణం :
రామాయణం ఆదికావ్యం, వేదం చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో, ప్రతిరోజూ రామాయణం చదివితే అతే పుణ్యం లభిస్తుంది. రామాయణం, నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. మన ఇండ్లలో రామయ్యలుండాలి, సీతమ్మలుండాలి. ప్రతి ఇల్లు రామరాజ్యంలో ఒక గృహంవలె ఉండాలి. ప్రతి కుటుంబం రాముని కుటుంబం కావాలి అనే ఉద్దేశంతో, వాల్మీకి రామాయణంలోని మూలకథను, యధాతథంగా వచన రూపంలో మలచిన ప్రయత్నం ఇది, మీ చేతుల్లో ఉంది.
ఇంటింటి కథ, రామకథ : మనందరిలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు దుర్గుణాలు లోపల తప్పక ఉంటాయి. వాటిని తొలగించేది రామకథ.
అలాగే క్షమ, ధైర్యం, దానం, త్యాగం, వీరత్వం, సద్బుద్ధిలాంటి గుణ గణాలను మనం పెంచుకోవడానికి ఉపకరించేది, రామకథ.
'శ్రీరాములు నీవే కలవు'' అని ముందుగా రాసి, ఆ తరువాత ఉత్తరం రాయడం - అలాగే 'శ్రీరామరక్ష సర్వజగద్రక్ష' అని చెప్పి స్నానం చేయించిన పిదప చిన్నారులకు రక్ష బొట్టు పెట్టడం అనే సంస్కృతి మెల్లగా మారిపోతున్న తరుణంలో, మళ్ళీ మనకు చేయూత ఇచ్చి, సభ్యత సంస్కారాలను, సంప్రదాయాలపట్ల మమకారాలను పెంచే దివ్యమైన కథ, రామకథ.
నేటి కాలంలో సమాజానికి పట్టిన సమస్త రోగాలనకు, దివ్యమైన ఔషధం రామకథ.
పేజీలు : 96