సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి!
అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించిందా? ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ఆ నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత అసహాయురాలిగా అనిపించింది? ఆ తర్వాత అడుగడుగునా అవమానాలను ఎలా భరించింది? ఎందుకు భరించింది? ఆమె మన:స్థితి ఎలా ఉంది? ఈ విషయాలు మహాభారతాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి అర్థం చేసుకుంటే గాని తెలియవు.
స్త్రీ మనస్సుని స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదేమో, ప్రతిభారాయ్ మనస్తత్వ శాస్త్రజ్ఞురాలు. ఆమె యాజ్ఞసేనికి ప్రాణంపోసి ఆమె ఆవేదననూ, అసహాయత్వాన్నీ, కర్తవ్య నిష్ఠనూ ఎంతో సమర్థవంతంగా మన ముందుంచారు.
- జయశ్రీ మోహన్రాజ్
''యాజ్ఞసేని అంటే యజ్ఞం నుంచి పుట్టినది. యజ్ఞసేనుని కుమార్తె కూడా. ఆమె కృష్ణ అనే మరో పేరున్న ద్రౌపది...ఆమె తన కథ తానే చెప్పుకుంటే అదులో ఆమె అంతరంగ ఆవిష్కరణ ఎలా ఉంటుందో దాన్ని ప్రతిభావంతంగా నిర్వహించిన నవల యాజ్ఞసేని.'' - వాడ్రేవు వీరలక్ష్మి