అణువణువునా విలక్షణం  ----
మూలకథల ఆత్మలు ధ్వంసం కాకుండా వాటిని మరో భాషలోకి అనువదించటం కత్తిమీద సాము. ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు ఎలనాగ. లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించిన ఉత్తమ కథాసాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా మహోపకారం చేశారు.
జ్ఞానపుష్టితో కూడిన ఈ 20 కథల్లో ఆకర్షణీయ మార్మికత కనిపిస్తుంది. అద్భుతమైన ఎత్తుగడ, ఊహకందుతూనే వయ్యారంగా సాగే నడక, అబ్బురపరచే శైలి, విభిన్నమైన శిల్పం, విలక్షణమైన ముగింపు... ఇవీ దాదాపు అన్ని కథల నిర్మాణ రహస్యం. అర్జెంటీనా కథ ‘ప్యారిస్‌లోని ఓ యువతికి ఉత్తరం’ ఒక నిగూఢ కావ్యం. మతిస్థిమితం లేని కొడుకును ఆస్పత్రికి పంపే ముందు ఓ తల్లి పడిన యాతన పోర్టోరికో కథ ‘నిర్దోషులు’లో గుండెలు పిండేస్తుంది. పాములు, కప్పలు, చేపలు, కొంగలే పాత్రధారులుగా విభిన్న కథనాన్ని అందిస్తుంది ఉరుగ్వాయ్ కథ ‘ఎర్రకాళ్ల కొంగలూ మేజోళ్లూ’. కొలంబియా కథ ‘కొంచెం సబ్బునురగ... అంతే’ సాదాసీదాగా సాగి, చివర్లో అబ్బుర పరుస్తుంది. పెరూ కథ ‘వార్డ్‌రోబూ, ముసలాయనా, మృత్యువూ’ ప్రవాహ శైలితో కట్టిపడేస్తుంది. మెక్సికో కథ ‘ప్రేమ వెనకాల మరణం’, పారాగ్వాయ్ కథ ‘ఖాళీక్షేత్రం’, క్యూబా కథ ‘ఆత్మగౌరవం’... దేనికదే ప్రత్యేకం. ‘బూజు వాసన గల అతని శ్వాస తాలూకు వేడి ఆవిరి’, ‘చలి ఇక్కడ పడుకుని, కూచుని, నడుస్తోంది’ వంటి వాక్యాలు పుస్తకం పొడవునా చదువరుల దాహం తీరుస్తాయి. - ఎమ్వీ రామిరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good