ఇరవై ఏళ్ళ సంసారంలో మీ నాన్నకు భార్యగా, మీకు తల్లిగా బతికాను. మీ నాన్న నన్ను ప్రేమించలేదు. నేనూ మీ నాన్నను ప్రేమించలేదు. ప్రేమించాలనే విషయం కూడా నాకు తెలియదు. మీ నాన్న నా భర్త. భర్తకు ఏం చెయ్యాలో, భర్త దగ్గర్నించి ఏం సాధించుకోవాలో నాకు సమాజం చెప్పింది. అదే చేశాను. ఒక భర్తకు భార్య ఏం చెయ్యాలని బోధిస్తారో, ఒక బిడ్డకు తల్లి ఏం చెయ్యాలని బోధిస్తారో అవే నేను చేశాను. వాటిల్లో  ఏ లోపమూ జరగకుండా చేశాను. కానీ నేను ఓడిపోయాను. ఓడిపోక తప్పదు. ఇసుక పునాదుల మీద ఏ భవనమైనా ఎలా నిలబడుతుంది? ఆ ఇసుక పునాదుల మీద మన జీవితాలు నిర్మించుకోవాలని మనకు నమ్మకంగా చెబుతున్న వారిపై నాకివాళ పట్టరాని కోపం వస్తుంది.
ఆడదానికి జీవితంలో ఏదో ఒక రోజు మనిషిగా, మానవిగా మారాల్సిన రోజు వస్తుంది. మానవిగా మారాలనే కోరిక బలవత్తరంగా కలిగే ఆ క్షణాల కోసం నా మాటల్ని జాగ్రత్తగా నీ మనసులో దాచుకో. మనిషిగా మారాల్సిన ఆ రోజు వచ్చినప్పుడు అట్లా మారే శక్తి లేకపోతే, మారటానికి ఏ ఆధారమూ దొరక్కపోతే మనం సర్వనాశనం అయిపోతాం. మనమంటూ మిగలం. అందుకని మన ప్రాణాలు ధారపోసి అయినా సరే మనుషుల్లా మారటానికి కావాల్సిన శక్తి సంపాదించుకుని తీరాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good