''పొద్దున్న మనందరం వేసుకున్న ప్రశ్న వుందే - ఈ దేశాన్ని రక్షించేవారేలేరా అని - ఈ దేశం అప్పుల్లోంచి బైటపడే మార్గమే లేదా అని -
ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది.
ఈ పల్లెల్లో వుంది. పల్లెల్లో వున్న కూలీలూ, రైతులూ, స్త్రీలు, దళితులూ వీళ్ళ దగ్గరుంది సమాధానం. వీళ్ళు మాత్రమే దేశాన్ని రక్షించగలరు. తమ రక్తం, చెమట, చివరకు ప్రాణాలు సైతం ధారపోసి దేశాన్ని రక్షించగలరు.
మనవంటి నగరవాసపు పరాన్న జీవులకు దేశాన్ని తాకట్టు పెట్టడం తప్ప రక్షించుకోవటం తెలియదు.
మనల్ని మనం రక్షించుకోవడమే మనకు తెలియదు. మనమే పెంచి పోషిస్తున్న సంస్కృతి మనల్ని కాటువేస్తుంటే ఒక కేకైనా వెయ్యకుండా నిశ్శబ్దంగా చచ్చిపోగలం.
మనకు అంతా కావాలి. తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు.
ఈ పల్లెల్లో దళితులున్నారే, స్త్రీలున్నారే - వాళ్ళకు ఇవ్వడం తెలుసు.
ఇన్నాళ్ళూ వాళ్ళకు తమకున్నదంతా ఇవ్వటమే తెలుసు. తమకు రావాల్సింది తీసుకోవటం తెలియదు. ఇవాళ వాళ్ళు తమకు రావాల్సింది తాము తీసుకోవాలని గ్రహించారు.
వాళ్ళు దాని కోసం, తమ హక్కుల కోసం, తమ మనుగడ కోసం పోరాటం మొదలు పెడితే యిక దేశానికి భయంలేదు.
దేశమంటే ఈ మనుషులే -
ఈ మనుషులకు దక్కాల్సింది దక్కితే దేశం బాగుపడినట్లే. నాకు ఇప్పుడు మనదేశం అభివృద్ధి వైపుకు నడువగలదనే నమ్మకం గట్టిగా కలుగుతోంది.
అభివృద్ధి అంటే ప్రాజెక్టులూ, ఫ్యాక్టరీలూ, రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలే కాదయ్యా - పీడితుల చైతన్యమే దేశాభివృద్ధి.
ఇవాళ ఈ స్త్రీలలో మనం చూసిన చైతన్యమే దేశాభివృద్ధికి కొలమానం.
ఆ అభివృద్ధి మనదేశంలో వున్నంత కాలం మనదేశాన్ని గురించి మనం దిగులు పడనక్కరలేదు.''
Pages : 152