మౌఖిక చరిత్ర వర్క్‌షాపులు స్పారో నిర్వహించిన ప్రాజెక్టులలో అంతర్గత భాగమయ్యాయి. స్త్రీల పాటలు, జానపద పాటలు, రూపకాలు, కథలూ ఇవన్నీ సంప్రదాయకంగా మన సంస్కృతిలోని మౌఖిక చరిత్రగా రూపొందాయి. కాలానికి నిలిచిన ఈ పలుకు చరిత మన మధ్య సజీవంగా ఉండి వర్తమానంలో కూడా ఒక అర్థాన్ని సంతరించుకుంది. ఇప్పటివరకూ మూగగా వున్న, ఓ మూలకు నెట్టివేయబడిన అనుభవాలకు గొంతునివ్వటం, భాషనివ్వటం అనేది మౌఖిక చరిత్రలను భద్రపరచటంలో ఒక ముఖ్యమైన పని. నిశ్శబ్ధంలోకి నెట్టబడిన వాటికి గొంతునివ్వటం, ఒక సంభాషణకు, పంచుకోవటానికీ, చర్చకూ దారితీస్తుంది. స్పారో అనేకమంది స్త్రీలను కొద్ది మంది ప్రేక్షకులతో మాట్లాడమని ఆహ్వానిస్తుంది. ఈ స్త్రీలు, వాళ్ళ జీవితాలు ఎంత ఆసక్తికరమైనవైనా, వెలుగు చూడనివి, వారి అనుభవాలకు సందర్భం ఉన్నా ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోయాయి. ప్రతి వర్క్‌షాప్‌ జరగగానే, అందులోని విశేషాలతో జీవిత విశేషాల రూపంలో స్పారో ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొస్తుంది. ఈ పుస్తకాలను ఏడు భారతీయ భాషలలోకి అనువాదం చేసే ప్రాజెక్టుని కూడా స్పారో చేపట్టింది. ఈ పుస్తకం అందులో ఒకటి.
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద రచనలను సాధికారికంగా ప్రవేశపెట్టిన రచయిత ఓల్గా. కథ, కవిత, నవల, సాహిత్య విమర్శ ఆ ప్రక్రియలన్నింటిలో ఆమె చేసిన అవిరళ కృషి తెలుగునాట ఆమెకు చెరగని స్ధానాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో సమగ్ర స్త్రీవాద కవితా సంకలనం 'నీలిమేఘాలు'. తెలుగులో తొలి స్త్రీవాద సిద్ధాంత గ్రంథం 'మాకు గోడలు లేవు' ఓల్గా సంపాదకత్వంలో వచ్చాయి. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించిన పుస్తకం 'మహిళా వరణం'కు ఓల్గా సహసంపాదకులు.
సాధారణంఆ స్త్రీలకు ప్రవేశం దొరకని తెలుగు సినిమా రంగంలో ఆమె పలు సినిమాలకు కథ, మాటలు, పాటలు, సహ దర్శకత్వం అందించారు. సంకలనకర్తగా, సంపాదకురాలుగా అనేక ప్రామాణికమైన రచనలను తీసుకొని వచ్చిన ఓల్గా ప్రస్తుతం పూర్తికాలం స్త్రీవాద కార్యకర్తగా అస్మితలో పని చేస్తున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good