ఈ కావ్యాన్ని చదువుతుంటే, నా దేశం నా కాలం నాకు కళ్ళకు కట్టినట్లయింది. నా మనుషులు నాతో మాట్లాడుతున్నట్లనిపించింది. కావ్యకర్త తాను కరిగారు. నన్ను కరిగించారు. దేశంలో పెచ్చరిల్లిపోత్ను నిరంకుశ ధోరణులు, ఓట్ల పండగలో జరిగే దగాలూ, దౌర్జన్యాలూ, కొండెక్కుతున్న జీవన సౌఖ్యాలను ఎగసనదోసే తెన్నుగానక తిరపతులకూ అన్నవరాలకూ పుట్టపర్తులకూ చేస్తున్న యాత్రలు, డబ్బు కక్కుర్తికి పౌరసత్వాన్ని అమ్ముకోవలసి వస్తున్న వైపరీత్యాలు- విషాదం మూర్తీభవించిన భారతదేశం ప్రత్యక్షమౌతున్నది. స్వరాజ్యలక్ష్మి మాచకమ్మగా పరిణమించినప్పటి బాధ, కావ్యకర్తనీ నన్నూ ఏకం చేయగలుగుతున్నది. ఈ బాధే కావ్యకర్తచే పరుష వాక్యాలాడించింది. అసభ్యాలని ''మర్యాదస్తు'' లనుకునే పదాలను గూడ నోట బెట్టించింది.
ఈ కావ్యకర్త వట్టి సాహిత్యోపజీవి అయితే ఈ కావ్యం ఇలాగుండేది కాదు. ఐనస్టీన్‌ మొదలు అప్పల్రాజు అభినవ కృష్ణావతారం వరకు, ప్రోటాన్‌ మొదలు పందులగూడెం ప్రసక్తి వరకు - ఆధునిక వైజ్ఞానిక, సాంఘిక విషయ లంపటత్వం, వీరి ఆశయం కాదు. రాజకీయ నేతృత్వం కూడా వీరికి ఉంది. ఓటు ''చట్టబద్ధమైన తిరుగుబాటు'' ''నిరంతర జాగరుకతే స్వాతంత్య్రానికి చెల్లించ వలసని మూల్యాం'' అనగలిగిన వ్యక్తి, సామాన్య వ్యక్తిమాత్రం కాదు. వాడిన మాటలు మోటు మాటలనిపించవచ్చు. అయితే ఆ మోటుతనమే ఈ కావ్యానికి బలమని నేననుకుంటున్నాను. అవి జనం మాటలు. అవే పనికిరాకపోతే, మరేవి పనికి వచ్చేటట్లు? వాటిలో జాతిగుండె కొట్టుకొంటూ ఉందిమరి! -కె.వి.రమణారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good