శ్రీ ఆవటపల్లి నారాయణరావు తెలుగు పత్రికారంగం మూలపురుషులలో ఒకరు. జాతీయోద్యమానికి, సాంస్కృతికరంగానికి మసూలాబందరు (మచిలీపట్నం) ఆటపట్టుగా వున్న రోజులలో అక్కడ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనిన మూర్తి. తొలిగా దేశోపకారి పత్రికలో ఓనమాలు నేర్చుకొని, కృష్ణాపత్రిక వ్యవస్థాపక ఉపసంపాదకునిగా ఆ పత్రికను తీర్చిదిద్దారు. సంపాదకునిగా పేరు ఎవరిదైనా 1907 వరకు కృష్ణాపత్రిక ఎదుగుదలకు నారాయణరావే కారణం. ఆంధ్రవార పత్రికకు మొట్టమొదటి సంపాదకుడు. సంవత్సరాది సంచికల ఆలోచన, రూపకల్పన నారాయణరావుదే. ఆంధ్రమహాసభ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు.

విశాలాంధ్రము గ్రంథంలో తెలుగువారిని సాంస్కృతికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఉత్తేజపరిచిన 88 మంది మహానుభావుల పదచిత్రాలను తీర్చిదిద్దారు. నారాయణరావు 'జాను తెనుగు' వచనం, రచనాశైలి వర్ధిష్టు పాత్రికేయులకు కరదీపిక.

కడచిన యాభై సంవత్సరా లీమధ్య ఆంధ్రదేశంలోనూ, ఆంధ్రదేశానికి వెలుపలనూ ఆంధ్రదేశాభ్యున్నతికై కృషిచేసిన, చేస్తూవున్న ఆంధ్ర ప్రముఖులను ఒకచోట చేర్చి, వారి కృషిని వివరించి 'విశాలాంధ్రము' అనే పేరున యీ పుస్తకాన్ని ఆంధ్రులకు సమర్పిస్తున్నాను.

ఇది తారీఖులకున్నూ, జీవిత వివరాలకున్నూ సంబంధించిన జీవిత చరిత్రల పుస్తకం కాదు. ప్రముఖుల దేశహితైక జీవనాన్ని వివరించడాకిన్నీ, వారి చిత్తరువును గీయడానికిన్నీ ప్రయత్నం చేయబడింది. ఈలాటి వుద్దేశంతో ఆంధ్రంలో వ్రాయబడ్డ పుస్తకాల్లో యిదే మొదటిదని నా అభిప్రాయము.

ఈ పుస్తకంలో చేర్చవలసిన చిన్నలూ, పెద్దలూ యింకా కొందరు వున్నారు. అయితే, వారి వివరాలు తెలియకపోవడంచేత వారిని దీనిలో చేర్చే గౌరవం నాకు లభించింది కాదు. దీనిలోని శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరిగారి కథ 'ప్రజామిత్ర' నుండిన్నీ, శ్రీ ముట్నూరి కృష్ణారావుగారి కథ 'భారతి' నుండిన్నీ తగు మార్పులతో గ్రహింపబడ్డవి. ఈ పుస్తకం అందరికీ తెలిసేటట్టుగా వాడుక భాషయందు వ్రాయబడింది. దీనిని రచించడంలో తోడ్పడిన మిత్రులందరికీ నా కృతజ్ఞతను విశదీకరించుకొంటున్నాను.

ఆవటపల్లి నారాయణరావు

Pages : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good