మనిషి మంచిమనుగడకి, మరింత సుఖంగా బ్రతకడానికి, గెలుపుకి, తనను తాను తెలుసుకోవడానికి ముఖ్యమయిన ఆయుధం భారతదేశంలోనే ఉద్భవించింది. దాని పేరు 'భగవద్గీత'. ''వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగులబెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమికొట్టారు... లే... పిడికిలి బిగించు. కత్తి తీసుకో. వారిని హతమార్చి నీ పగ తీర్చుకో'' అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. మనిషి యుద్ధం ఎందుకు చెయ్యాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాల్ని విప్పాడు. కష్టాలకి దు:ఖ కారణాలు వివరించాడు. మనసు అశాంతికి, సంఘర్షణకు గురయినపుడు మానసిక వైద్యులు చేసేది. సైకోథెరపీ (టాక్‌ థెరపీ). ఈ నాటి మానసిక వైద్యుల కంటె ఎన్నో వేల సంవత్సరాలకు ముందే మానసిక ఆందోళనకు గురయిన అర్జునుడికి సైకోథెరపీ చేసిన మొట్టమొదటి సైకియాట్రిస్ట్‌ చరిత్రలో శ్రీకృష్ణుడే.

మనిషి తన జీవితకాలంలో సంపాదించుకోవలసిన ధైర్యం, సంపద, ఆరోగ్యం, కీర్తి, జ్ఞానం, శాంతి అనే ఆరు ఆస్తులను సముపార్జించటానికి భగవద్గీత ఏ విధంగా తోడ్పడుతుందో వివరించే పుస్తకమే 'విజయానికి ఆరోమెట్టు'. త్యాగం, తత్వజ్ఞానాలను బోధించే భగవద్గీత ఉద్దేశ్యం కర్మఫలత్యాగం. ఫలితాన్ని ఆశించకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది ? సమస్య ఎందుకు వస్తుంది ? ఎదురైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి ? అంతిమంగా సాధించే ప్రయోజనాలేమిటి ? అనే విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా గీతలోని శ్లోకాలసాయంతో సోదాహరణంగా వివరించిన యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రతి అక్షరం ప్రతివాక్యం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ''భగవద్గీతా ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే'' అన్న స్థితినుంచి వచ్చేతరాన్ని పరిరక్షించుకోవటం కోసం రాసిన పుస్తకమిది.

అలనాటి అర్జునుడికి సైకోథెరపీ చేసిన కృష్ణుడిలాగే ఈ విజయానికి ఆరోమెట్టు ద్వారా వీరేంద్రనాథ్‌ తెలుగు సాహితీ ప్రపంచంలో మోడరన్‌ కృష్ణుడిగా నిలిచిపోతాడని, ఈ పుస్తకం చదివిన తర్వాత మీరనుకుంటే మే మేమీ ఆశ్చర్యపోము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good