ఒక శుక్రవారం సాయంత్రం - లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం.

ఆ సమయంలో ఒక ముఫ్పై ఏళ్ళ వ్యక్తి ఇద్దరు పిల్లల్తో వచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు కొట్టుకుంటూ, అల్లరిచేస్తూ మా మధ్య తిరుగుతూ అల్లరి చెయ్యసాగారు.

అందరికీ అది చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక సహించలేక 'ఇది లైబ్రరీ, మీ పిల్లల్ని గోల చెయ్యవద్దనండి' అన్నాను కరుగ్గా. అతడు తన నిస్తేజమైన కళ్ళతో నావంక చూసాడు. 'గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు... వాళ్ళ అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తర్వాత ఇస్తామన్నారు. ఆస్పత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకు వచ్చాను' అన్నాడు.

అతడి మీద అప్పటివరకూ ఉన్న కోపం జాలిగా మారింది. కోపం జాలిగా, అసూయ ప్రేమగా, ద్వేషం స్నేహంగా, పగ ప్రేమగా, అసమర్ధత సమర్ధతగా, ఆవేశం ఆలోచనగా మారవచ్చు.ఇవన్నీ మన బలహీనతల స్థాయి భావాలు.

కావలసినదల్లా పరిస్థితిని పై స్థాయిలోంచి పరిశీలించగల్గడమే. సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే.

అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది. అదే యండమూరి వీరేంద్రనాథ్‌ చెపుతున్న 'విజయం వైపు పయనం'

Write a review

Note: HTML is not translated!
Bad           Good