సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు, సైకియాట్రీకు తేడా వుంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్ధంలో సైకాలజీ అంటే జీవరోగాలకు సంబంధించిన ప్రవర్తనకు చెందిన శాస్త్రంగా దీన్ని అభివర్ణించారు.
సైకాలజీ ప్రాధాన్యత
తెల్లవారిన దగ్గర్నుండీ మరల రాత్రి పడుకునేవరకూ మనిషి ఈ రోజుల్లో చాలా బిజీబిజీగా సతమతమవుతున్నాడు. విపరీతమైన కోరికలతో, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఏదో ఏదో చెయ్యాలని, ఎంతో సంపాదించానే తపన ఎక్కువగా కనిపిస్తుంది. మనిషి మెదడు మన యంత్రాల కంటే చాలా మెరుగ్గా పనిచేస్తుంది కానీ మనం రోజూ వాడే సెల్ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అది పనిచేయదు కదా! అది పనిచేయాలంటే మరలా రీఛార్జి చేయాల్సిందే. అలాంటి రిలీఫ్ లేకుండా మన మెదడుకు నిరంతరం పని కల్పిస్తే కొంతకాలానికి ఛార్జింగ్ అయిపోయినట్లే. అది ఆలోచించడం మానేయవచ్చు. అలిసిపోయి పొరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు
స్వార్థం పెరిగిపోతున్న నేటి సమాజంలో సంపాదించేద్దాం అనే తపనతో మెదడుకు విశ్రాంతి లేకుండా పోవడం, తద్వారా రకరకాల మానసికపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి సైకాలజీ ప్రాధాన్యత ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా పెరిగింది. మున్ముందు దీని ప్రభావం ఇంకా పెరుగుతుందనే చెప్పవచ్చు.
కాబట్టి సైకాలజీ గురించి వివరంగా చిన్నతనం నుండే అవగాహన ఏర్పరచుకుంటే భవిష్యత్లో మీరే మీ ప్రవర్తనలను అదుపులో ఉంచుకునే శక్తిసామర్ధ్యాలు పొందవచ్చు. మొక్కై వంగనిది మానై వంగునా. చిన్నతనం నాడే మీరు సైకాలజీ పట్ల కొంతమేరకైనా అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితాన్ని అర్ధవంతంగా మార్చుకోవచ్చు.