గతకాలపు చీకటి నీడల్లోంచి, వర్తమాన సంక్షోభంలోంచి, రేపటిలోకి ప్రయాణిస్తున్న అవిశ్రాంత పథికుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరవై ఏళ్ళనాడు మొదలైన ఈ జీవన యానం ఎన్నో దిగుళ్ళను, ఎగుడు దిగుళ్ళను అధిగమించింది. ఏ మజిలీలోను ఆగని నడక అతనిది. వ్యధావశిష్టమై ఆరని ఉత్సాహం అతనిది.
పెనుగొండకు మరో పేరు జీవనోత్సాహం. అతనెప్పుడూ దు:ఖాన్ని ప్రేమించలేదు. ధైర్యాన్ని ప్రేమించాడు. ఆరాటాల బాట పట్టలేదు. పోరాటాల పాట అందుకున్నాడు. కావ్యకర్తగా కన్న కార్యకర్తగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడతను.
సాహిత్య తైలంతో సదా వెలుగొందే చల్లని దీపం అతను. తన వరకే పరిమితం కాని పెద్ద చుట్టుకొలత గల జీవిత వృత్తాన్ని, వృత్తాంతాన్ని గీసుకున్నాడు పెనుగొండ. ఆ వలయంలో అతని వెలుగునీడల బాల్యం, కుటుంబం, బాంధవ్యం, స్నేహ సమూహం, పరిచయాల సమాజం- ఇంకెన్నో ఉన్నాయి.
అతని సాహిత్యం కన్న అతని స్నేహశీలం గొప్పది. పెనుగొండకు మారు పేరు బహువచనం.
- డా|| పాపినేని శివశంకర్