ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ

'వేయిపడగలు' ఒక అద్భుత సృష్టి. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. 'వేయిపడగలు' కేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధానంగా ప్రతీకాత్మక నవల 'వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నదీ కలలోన రాజును' అన్న పాటతో మొదలవుతుంది వేయిపడగలు. కావ్యోపక్రమంలోనే కావ్యతత్త్వాన్ని సూచించే శిల్ప సంప్రదాయాన్నిట్లా పాటించారు విశ్వనాథ. వేయిపడగలపాము కుండలినీ సాధనకు ప్రతీక. ఆదిశేషునికి కూడా వేయి పడగలుంటాయి.

ఇందులో అరుంధతీ ధర్మారావులు నాయికానాయకులు. 'వేయిపడగలు'లోని పలు పాత్రలు మానుష ప్రపంచాన్ని దాటి పోతాయి. అక్ష్మణస్వామి (ఏనుగు), పసిరిక వంటి పాత్రలు దీనికి ఉదాహరణలు. ఇక ధర్మారావు ధర్మం రూపుకట్టిన పాత్ర. గోపన్న కతడు సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అపరావతారం.

కథాస్థలమైన సుబ్బన్నపేట ఓ గ్రామం. అది కాలక్రమంలో పాశ్చాత్యపుపెను ప్రభావాలతో ఆధునిక నాగరకతా పోకడలు పోయి, ఎట్లా పలుదుష్పరిణామాలకు లోనైందోనన్నది 'వేయిపడగలు' ఇతివృత్తం. సుబ్బన్నపేట యవద్దేశానికీ లక్ష్యభూతమైన గ్రామం. అది సుబ్రహ్మణ్య శబ్దానికి వికృతి. సుబ్రహ్మణ్యేశ్వరుడు వేయిపడగల స్వామి. వేయిముఖాలైన ధర్మానికి చిహ్నం. ''వేయిముఖాలుగా ధర్మం పరిపాలింపబడ్డ యా దేశమే సుబ్బన్నపేటగా చెప్పబడింది. అంతేగాని, యిది ఒక ఊరుకాదు. ఇది ఒక జమీందారీ కాదు .....'' అని విశ్వనాథవారే ఒక రేడియో ప్రసంగంలో వివరించారు (జాగృతి 18-3-1955)

''ఔను, నీవు మిగిలితివి, ఇది నా జాతి శక్తి, నా యదృష్టము'' అంటుంది ధర్మారావు పాత్ర నవల చివరలో. సర్వధర్మాలూ నశించినప్పటికీ భారతదేశాన దాంపత్య ధర్మం ఒకటి మిగిలిందన్నది దాని అంతరార్ధం. రామేశ్వర శాస్త్రి, రంగాజమ్మ, మంగమ్మ, రంగారావు, హరప్ప, రుక్మిణమ్మారావు, కేశవరావు, దేవదాసు, పసిరిక, గణాచారి..... ఇట్లా ఎన్నో పాత్రలు ఆయా వ్యవస్థలకూ ధోరణులకు చిహ్నాలు; ప్రతీకలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good