వేలూరి శివరామ శాస్త్రి కథలు  - 1

కథా పథంలో దారిదీపం
తెలుగు సాహిత్యం - సాము, గరిడీల మెరుపులతో సర్కస్‌ ఫీట్లతో జనాన్ని ఆకర్షిస్తున్న కాలం అది. తిరుపతి వెంకటకవులు, కొప్పరపుకవులు అవధానస్పర్థలతో తెలుగు నాటి కవులను ఆకట్టుకొంటున్న సందర్భమది. కవులు తామెక్కడివాళ్ళైనా ఇద్దరు కలిసి జంట కవుల మంటూ కవన వీరంగం వేస్తూన్న రోజులవి.
ప్రతి కవీ తాము తిరుపతి కవుల ప్రత్యక్ష, పరోక్ష శిష్యులమంటూ రొమ్మువిరుచుకొని ఆశుకవిత్వ సంతర్పణలు చేస్తున్న రోజులవి. అలాంటి రోజుల్లో స్వయంగా తిరుపతి వెంకటకవులే ఓయువ కవిని 'మహస్సాగర' అని - సంభావించటం మాటలే కాదు. ఈ బిరుద గ్రహీత వేలూరి శివరామశాస్త్రిగారు. అప్పటికాయనింకా 'పహెలా పచ్చీస్‌' లోపలివాడే ! వీరు చాలా భాషలు నేర్చారు. అందులోని రచనలను మూల విధేయాలుగా తెలుగులోకి పరివర్తన చేశారు. ప్రాచీన కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశారు. ఇవన్నీ ఒక ఎతైతే కథలను రాసి వాసికెక్కటం ప్రస్తుతం మన దృష్టి కవసరం. ఆధునిక తెలుగు కథా వికాస - ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఈ కథలను చదవాలి
తెలుగు సమాజంలోని శతాబ్దాల, దశాబ్దాల పరిణామాలు చరిత్ర గతమైనవి. ఈ స్పృహ వేలూరి శివరామశాస్త్రి కథల్లో కన్పించడం మనల్ని ఆలోచనలకు పురికొల్పుతుంది. వైదికం, బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం - ఈ మతాలు మతశాఖలు - ధియోసొఫిస్టులు, సత్సంగులు, చైతన్యులు వగైరా వ్యక్తుల మీద వేసిన ముద్రలను ఆయన తమ కథల్లో పరామర్శించారు. గురజాడ తర్వాత 1925-50ల మధ్య తెలుగు కథల్లో బౌద్ధాన్ని తడిమిన, పరామర్శించిన కథకుడు ఆయనేనేమో. బ్రిటిష్‌ వలసపాలన నాటి పాలన, న్యాయ పద్ధతులు మొదటి ప్రపంచయుద్ధం, జాతీయోద్యమం గాంధీమార్గం, ఆర్థిక కాటకం - వీటి పర్యవసానాలను ఆయన 'ఓబయ్య', 'చీకటితప్పు', అనే పెద్ద కథల్లో ప్రముఖంగా చర్చించారు. ఆ రోజుల్లోని వ్యక్తుల రూపురేఖా విలాసాలనూ, వేషభాషలనూ, వైదిక ఇంగ్లీషు చదువులనూ, ఆచారవ్యవహారాలనూ, అలవాట్లనూ, కట్టుబాట్లనూ, నమ్మకాలనూ, న్యాయా న్యాయాలనూ, ప్రేమలూ పెండ్లిండ్లనూ, నీతి అవినీతులనూ, వైద్య పద్ధతులనూ, కులవృత్తులనూ, కలిమి లేములనూ, వ్యవసాయాల్నీ, వ్యాపార వాణిజ్యాలనూ, డబ్బు మారకపు విలువలనూ పాత్రోన్ముఖంగా, నేపథ్య భాగంగా కథల్లో అంతర్భాగం చేశారు. ఆనాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని కళ్లకు గట్టారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good