రచయిత తన శైలిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ కథా రచన చేయటం ద్వారా తన రచనా ప్రవాహాన్ని నిత్యనూతనంగా నిరంతరాయంగా కొనసాగించడం సాధ్యమవుతుంది. ఈ లక్షణం మధురాంతకం నరేంద్రలో పుష్కలంగా ఉంది. 'రెండేళ్ల పథ్నాలుగు' కథా సంపుటిలోని కథలతో అప్పటివరకూ ఉన్న తన శైలిని తానే ఛేదించుకుని నూతన ధోరణిలో కథా రచన సాగిస్తున్నారు. తన శైలిద్వారా పాఠకుడిని కథ లోతుల్లోకి తీసుకెళ్లడంతో పాటూ అది పాఠకుడిని నిత్యం వెంటాడే కథగా రూపొందించటంలో నరేంద్రది ప్రత్యేక శైలి. ఇందుకోసం చిన్న చిన్న విషయాలను సైతం వదలకుండా పరిసరాలను, పాత్రల స్వరూప స్వభావాలను, హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా రచయిత దీన్ని సాధించగలిగాడు. నరేంద్ర ఎంచుకున్న కథావస్తువు, కథలోని పాత్రలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. కథా రచనలో నరేంద్ర సాధించిన పరిణతికి నిదర్శనం ఈ కథలు. - వాసిరెడ్డి నవీన్‌, కథాసాహితి సంపాదకులు.

    నరేంద్ర కథల్లో బహుళ ప్రపంచం కనిపిస్తుంది. అతడి కథా వస్తువులు సమకాలీన భారతదేశ భాషా సామాజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి. అతడి కథల నేపథ్యంలో ప్రకృతి, పరిసరాలు, సమాజం దామలచెరువు, తిరుపతి దాటి గోదావరి, పాపికొండలు, చిరపుంజి శిఖరాలు, గంగా బ్రహ్మపుత్ర, నదీపరీవాహక ప్రాంతాలు దాటి మెక్సికో వరకూ విస్తరిస్తాయి. నరేంద్ర సామాజిక చింతనాశీలిగా, ఉద్వేగాలకు లోనుగాని అన్వేషిగా మనస్తత్వ పరిశీలకుడిగా పరిచయమవుతాడు. - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good