తెలుగు కథానిక 1902 ప్రాంతాలనించి పురిటినొప్పులు పడి 1910లో గురజాడ 'దిద్డుబాటు'తో సలక్షణంగా సామితీలోకంలోకి ప్రవేశించింది. ఆరకంగా తెలుగు కథానికకు 104 ఏళ్ళని చెప్పుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి నేటి దాకా తెలుగు కథానిక భారతీయ జీవితంలోని వెలుగు చీకట్లకు అద్దం పట్టుతూ వచ్చింది- ఊరికే అద్దం పట్టడం కాకుండా సామాజిక పరివర్తనకు తాను స్పందిస్తూ, సామాజిక మార్పులకు దోహదం చేస్తూ, తన సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నది. భారతీయ సమాజంలో సంభవిస్తున్న ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక సందర్భాలకు తెలుగు కథానిక ఎప్పటికప్పుడు ప్రతిఫలనంగా నిలుస్తున్నది.

ఇప్పటికి సుమారు లక్షన్నర కథానికలైనా ప్రచురింపబడ్డాయని ఒక అంచనా. వీటిలో అత్యధిక సంఖ్యలో కథానికలు పత్రికల్లోనే మిగిలిపోయాయి. సంకలనాల్లోకి ఎక్కినవి అతి తక్కువ కథానికలే. ఒకనాటి పత్రికలు మరికొంద కాలానికి అలభ్యాలై తర్వాతి తరాలకు అందుబాటులో ఉండటంలేదు. వచ్చిన కథానికలన్నీ ఎప్పటికప్పుడు సంకలన రూపంలో వస్తే కథానికాధ్యయనం సులభతరమౌతుంది. అయితే ఇది వ్యవ ప్రయాసలతో కూడినపని. ప్రభుత్వానికి గొప్ప సాంస్కృతిక దృష్టి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. వ్యక్తిగతంగా రచయితలు, కొన్ని సాహితీ సంస్ధలు, ప్రజా సంఘాలు, తమ తమ అభిరుచులకు, ప్రయోజనాలకు అనుగుణంగానైనా తెలుగులో కథా సంకలనాలు తెస్తున్నారు. అలా వెలువడినదే వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-3, 50 కథలున్న ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good