ఈ సంపుటిలోని మొదటి కథే 'ఆలంబన'. వృద్ధుల శేష జీవితం, అనాథ బాలల భావిజీవితం ఆనందంగా ప్రయోజనకరంగా సాగే జీవన విధానాన్ని ఆవిష్కరించిన కథ. భార్యావియోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు ఒంటరిగా ఉండనూ లేక, కొడుకుతో అమెరికా వెళ్ళనూ లేక నిస్పృహచెందిన సమయంలో ఆయనకి జీవితంపట్ల స్ఫూర్తిని కలిగించడం ఈ కథ ప్రధానాంశం. వృద్ధాశ్రమాలు అంటే, వృద్ధులు డబ్బులిచ్చి ఊరికే తిని కూర్చునేందుకు ఏర్పాటైన సంస్థలుగా కాకుండా, వృద్ధుల జీవితానికొక పరమార్థం, ప్రయోజనం, అనాథ బాలలకు ఒకరక్షణా, బాధ్యతా కలిగించే చైతన్యవంతమైన సంస్థలుగా ఉండాలని సూచించడం స్ఫూర్తిదాయకంగా ఉంది.

    ఇంకా అనుకూల దాంపత్యాలగురించీ, ఆదర్శవివాహాల గురించీ, అత్తింటి కాపురాల గురించీ, పిల్లల పెంపకం గురించీ, స్త్రీలపై జరిగే అత్యాచారాల పరిణామాల గురించీ, బడుగువర్గాలకు చెందిన వారి అక్షరాస్యత గురించీ, నిత్యజీవితంలో నైతికత గురించీ వైవిధ్యంతో కూడిన కథలు కనిపిస్తాయి ఈ సంపుటంలో.

    దాంపత్య జీవితం సవ్యంగా సాగాలంటే స్త్రీలు, పురుషుల ప్రవర్తన వెనుక ఉండే పరిస్థితుల్ని అవగాహన చేసుకుని, వారి మనస్తత్వాలకీ, అభిరుచులకీ, అవసరాలకీ అనుగుణంగా సర్దుకు పోవాలని చెప్పే 'సంసారవీణ', 'మనసుకీ మనసుకీ మధ్య' అనే కథలు స్త్రీలకు మాత్రమే నీతిబోధ చేసే సాంప్రదాయక సంస్కృతిని సమర్థిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే, మరోవైపు, వివాహవ్యవస్థలో పురుషాధిపత్యాన్నీ, పురుషుడి స్వార్థపరత్వాన్నీ బయటపెట్టిన కథ 'ఓ మగాడి స్వగతం'. 

    అన్యోన్య దాంపత్యానికీ, ఆదర్శవంతమైన పిల్లల పెంపకానికీ ప్రతీక 'వర్షిణి' అనే అందమైన కథ. ఈనాటి అత్తాకోడళ్ళ సంబంధాల్లో అవగాహన పెంపొందించే కథ 'గెలుపు'.

    ఆదర్శం పేరుతో, అత్యాచారానికి గురైన స్త్రీని పెళ్ళిచేసుకుని, భార్యతో క్రూరంగా ప్రవర్తించే పురుషుల కొక గుణపాఠం చెప్పిన కథ 'ముసురు'.

    ప్రేమ పేరుతో అవగాహనారాహిత్యంతో ఆత్మహత్యకి పాల్పడే యువతకి కనువిప్పు కలిగించే కథ 'ప్రశ్నార్థకం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good